Ravi Shastri on WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా తుది జట్టును ఎంపిక చేసిన రవిశాస్త్రి
Ravi Shastri on WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా తుది జట్టును ఎంపిక చేశాడు రవిశాస్త్రి. అతని టీమ్ లో అజింక్య రహానేకు చోటివ్వడం విశేషం.
Ravi Shastri on WTC Final: ఐపీఎల్ మరో మూడు మ్యాచ్ లతో ముగిసిపోనుంది. ఇక అందరి కళ్లూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)పై పడ్డాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఫైనల్ కోసం టీమిండియా తుది జట్టును మాజీ కోచ్ రవిశాస్త్రి అంచనా వేశాడు. తన జట్టులో అతడు అజింక్య రహానేకు అవకాశం ఇచ్చాడు.
లండన్ లోని ఓవల్ లో ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. డొమెస్టిక్ క్రికెట్ తోపాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన రహానేకు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, బుమ్రాలాంటి సీనియర్లు గాయాలతో మిస్ అవడంతో సీనియర్ అయిన రహానేకు చోటు దక్కింది.
అయితే ఈ ఫైనల్ ఆడే తుది జట్టులోనూ రహానేకు చోటు దక్కుతుందని రవిశాస్త్రి అంచనా వేస్తున్నాడు. ఐసీసీ రివ్యూలో అతడు మాట్లాడాడు. ఈ ఫైనల్ ఆడబోయే 11 మందిని అతడు ఎంపిక చేశాడు. "అతని టైమింగ్ అద్భుతం. టీ20 ఫార్మాట్ ను భిన్నంగా చూస్తున్నాడు. చేసిన పరుగులను అతడు పట్టించుకోవడం లేదు. కానీ ఆ పరుగులను ఎన్ని బంతుల్లో చేశానన్నది చూస్తున్నాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది" అని రహానే గురించి రవిశాస్త్రి అన్నాడు.
అతడు డొమెస్టిక్ క్రికెట్ లో రాణించి.. ఆ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించాడని శాస్త్రి చెప్పాడు. ఇక రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని కూడా అతడు స్పష్టం చేశాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమైన విషయం తెలిసిందే. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలు కేఎస్ భరత్ కే అప్పగిస్తారని కూడా శాస్త్రి చెప్పాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రవిశాస్త్రి తుది జట్టు ఇదే
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్
సంబంధిత కథనం