Gavaskar attacks Ponting: పాంటింగ్, లారా వల్లే ఆ రెండు టీమ్స్ ఓడిపోయాయి: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్-gavaskar attacks ponting and lara for the failures of dc and srh in ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar Attacks Ponting And Lara For The Failures Of Dc And Srh In Ipl 2023

Gavaskar attacks Ponting: పాంటింగ్, లారా వల్లే ఆ రెండు టీమ్స్ ఓడిపోయాయి: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
May 23, 2023 02:42 PM IST

Gavaskar attacks Ponting: పాంటింగ్, లారా వల్లే ఆ రెండు టీమ్స్ ఓడిపోయాయని గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్పోర్ట్స్ స్టార్ కు రాసిన కాలమ్ లో అతడు ఈ ఇద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

సునీల్ గవాస్కర్, రికీ పాంటింగ్
సునీల్ గవాస్కర్, రికీ పాంటింగ్ (BCCI/PTI)

Gavaskar attacks Ponting: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలకు ఆ జట్ల కోచ్ లు, లెజెండరీ ప్లేయర్స్ రికీ పాంటింగ్, బ్రియాన్ లారాలను తప్పుబట్టాడు సునీల్ గవాస్కర్. పాంటింగ్ కు అంత మొండితనం ఎందుకు అని ప్రశ్నించాడు. వీళ్ల వల్లే కొందరు ప్లేయర్స్ ఏమాత్రం ఎదగలేకపోయారని కూడా సన్నీ విమర్శించడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

స్పోర్ట్స్ స్టార్ కు రాసిన కాలమ్ లో ఈ ఇద్దరిపై గవాస్కర్ విరుచుకుపడ్డాడు. "ప్లేఆఫ్స్ వచ్చేశాయి. నాలుగు టీమ్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. గతంలో చూడని ఛాంపియన్స్ ను చూస్తామా లేక అనుభవంతో గత ఛాంపియనే మళ్లీ అవుతారా అన్నది చూడాలి. ప్లేఆఫ్స్ మిస్ అయిన వాళ్లు పోస్ట్ మార్టమ్ చేస్తూ ఉంటారు. అయితే దానిని ఫైనల్స్ ముగిసిన తర్వాత కొన్ని రోజులకు చేస్తే బాగుంటుంది" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

"ముఖ్యంగా ఆ విశ్లేషణ నిజాయతీగా జరగాలి. వచ్చే వేలంలోపు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. టేబుల్లోని కింది రెండు టీమ్స్ చాలా విశ్లేషించుకోవాలి. క్రికెట్ చరిత్రలో ఇద్దరు అతి గొప్ప బ్యాటర్లు ఈ రెండు జట్ల (డీసీ, ఎస్ఆర్‌హెచ్)కు కోచింగ్ ఇచ్చారు. అయినా ఆ జట్లు టేబుల్లో కింద ఉన్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఆ ప్లేయర్స్ కు ఉన్న చరిష్మా కూడా ఇందులో ఒక కారణం. దీనివల్ల దేశవాళీ క్రికెటర్లు వారికి దూరమవుతారు. అలాంటి ప్లేయర్స్ దగ్గరికి వెళ్లి సందేహాలు అడగానికి వాళ్లు సంకోచిస్తారు" అని గవాస్కర్ అన్నాడు.

అసలు పాంటింగ్ కోచింగ్ లో ఆటగాళ్లలో ఎలాంటి పురోగతి లేదని కూడా సన్నీ నిందించాడు. సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, ప్రియమ్ గార్గ్ లాంటి వాళ్లు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయారని గవాస్కర్ అన్నాడు. "వాళ్లు ఆడే రోజుల్లో సులువుగా పరిష్కరించిన సమస్యను ఇప్పుడు పరిష్కరించలేకపోతున్నారు. ఇక చాలాసార్లు వాళ్ల భాష కూడా అడ్డంకిగా మారుతోంది. మారుమూల ప్రాంతాలు వచ్చే ఇండియన్ ప్లేయర్స్ వాళ్ల ఇంగ్లిష్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఆ ప్లేయర్స్ అలాగే ఆగిపోయారు" అని సన్నీ అన్నాడు.

ఇక అక్షర్ పటేల్ విషయంలో పాంటింగ్ మొండిగా వ్యవహరించాడని కూడా గవాస్కర్ విమర్శించాడు. "ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేయడంలో పాంటింగ్ మొండిగా వ్యవహరించాడు. అది చూసే రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ ను ఏడో స్థానం కంటే పైన పంపకూడదని కాంట్రాక్ట్ లాంటిది రాసుకున్నారేమో అని శాస్త్రి అన్నది అందుకే" అని గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు.

WhatsApp channel