Poli padyami: కార్తీక మాసంలో పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? ఈ వ్రత కథ ఏంటి?-when is poli padyami in 2024 what is the significance of this vratham ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Poli Padyami: కార్తీక మాసంలో పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? ఈ వ్రత కథ ఏంటి?

Poli padyami: కార్తీక మాసంలో పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? ఈ వ్రత కథ ఏంటి?

Gunti Soundarya HT Telugu
Nov 18, 2024 03:47 PM IST

Poli padyami: కార్తీకమాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. పోలి కథను చదువుకుంటారు. అసలు ఈ పోలి ఎవరు? కథ ఏంటి అనేది తెలుసుకుందాం.

పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది?
పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? (pinterest)

కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలి పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమి జరుపుకుంటారు.

ఈ ఏడాది డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలి పాడ్యమి జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలి పాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు.

పోలి కథ

ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్లింది.

చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్ళతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది.

ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త, తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకెళ్లారు.

పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు దీప దానం చేయడం కూడా చాలా మంచిది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner