Sravana masam 2024: శ్రావణ మాసంలో శివునికి ఈ ఆరు పొరపాటున కూడా సమర్పించవద్దు, అశుభం జరుగుతుంది
Sravana masam 2024: శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు పొరపాటున కూడా సమర్పించకూడదు. దీని వల్ల శివుని అనుగ్రహం పొందలేకపోతారు. అవి ఏంటి? ఎందుకు సమర్పించకూడదో తెలుసుకుందాం.
Sravana masam: శ్రావణ మాసంలో శివుని ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక వస్తువులు సమర్పిస్తారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచామృతంతో అభిషేకం నిర్వహిస్తారు. అయితే శ్రావణమాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు కొన్ని సమర్పించకూడని వస్తువులు ఉన్నాయి. ఇవి శివుని పూజకు దూరంగా ఉంచాలి. అవి ఏమిటో తెలుసుకుందాం.
తులసి
హిందువులకు అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి. ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే తులసి ఆకులు విష్ణుకు ప్రీతికరమైనవి కానీ శివుడికి సమర్పించకూడదు. ఎందుకంటే హిందూ గ్రంధాల ప్రకారం తులసి రాక్షసి రాజు జలంధరకు భార్య. విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరను నాశనం చేశాడు. అందువల్ల శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు. అలాగే తులసి మాలతో శివ మంత్రాన్ని జపించకూడదు.
పసుపు
పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమం, శుభకార్యం జరగదు. పసుపు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వైద్య లక్షణాలు, ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ పసుపును శివుడికి సమర్పించరు. ఎందుకంటే శివుడు సన్యాసిగా ప్రాపంచిక సుఖాల నుండి తనను తాను వేరు చేసుకున్నాడు. పసుపు సంతానోత్పత్తి, వివాహంతో ముడిపడి ఉంది. అందుకే శివుడికి పసుపు సమర్పించరు. బదులుగా చందనం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది.
కుంకుమ
సింధూరం కూడా శివునికి సమర్పించకూడదు. ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ కూడా సంతానోత్పత్తి, వైవాహిక జీవితానికి సంబంధించినది. ఇది శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతల ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు. శివుడు నిర్లిప్తతకు చిహ్నం. అందుకే శివునికి సమర్పించరు. బదులుగా శివుడికి భస్మాన్ని సమర్పిస్తారు.
చెడిపోయిన బిల్వపత్రాలు
విరిగిన, చెడిపోయిన బిల్వ పత్రాలు పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు. శుభ్రంగా ఉన్నవి, ఎటువంటి మరకలు లేని మూడు ఆకుల బిల్వ పత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి. పాడైపోయిన బిల్వ పత్రాలు సమర్పించడం అపరాధం చేసినట్టే.
కంచు పాత్రలో నీరు
శివుడు అభిషేక ప్రియుడు. నీరు గంగాజలం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. అభిషేకం సమయంలో శివునికి గంగాజలం, తేనె, పెరుగు, పంచామృతంతో పాటు మరెన్నో సమర్పిస్తారు. కానీ శివలింగానికి నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర అవ్వకూడదు. కంచు కుండలో నీటిని సమర్పించడం అశుభంగా భావిస్తారు. రాగి, వెండి లేదా మట్టి కుండలు అందుకు ఉపయోగించడం ఉత్తమం.
శంఖం ఊదకూడదు
చాలామంది పూజ సమయంలో శంఖాన్ని ఊదడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. శంఖాన్ని ఊదుతున్న వ్యక్తి అతని చుట్టూ ఉన్న సానుకూల ప్రభావాన్ని ప్రభావితం చేస్తుందంటారు. అయితే శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే చాలా కాలం క్రితం శివుడు శంఖచవుడు అనే రాక్షసుడిని ఓడించాడని చెబుతారు. శంఖం అదే రాక్షసుడి రూపమని నమ్ముతారు. అందుకే శంఖం ఊదడం, శంఖం ద్వారా నీటిని సమర్పించడం మంచిది కాదు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.