Karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటి?
Karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 వత్తులతో దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి రోజు పాటించే ఆచారాల గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. జన్మ జన్మల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు. ఈరోజు శివ, శైవ క్షేత్రాలన్నీ భక్తుల పూజలతో కళకళాడతాయి. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 15 వచ్చింది.
365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు?
కార్తీక పౌర్ణమి రోజు అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ఎక్కువ మంది ఆచరించేది 365 వత్తులతో గుడిలో దీపం వెలిగిస్తారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేస్తారు. అలా చేయడం కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 వత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు. అయితే 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు అనే సందేహం చాలా మందికి వస్తుంది.
కార్తీక మాసం అంటేనే దీపారాధనకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఒక వేళ ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథులలో దీపం పెడతారు. అదిఈ సాధ్యపడని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకుని వెలిగిస్తారు. సంవత్సరానికి 365 రోజుల లెక్కన ఒక్కో రోజుకు ఒక్కో దీపం లెక్క అలా వెలిగిస్తారు. దీపం వెలిగించే ముందు ఈ శ్లోకం పఠిస్తారు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహా
భక్త్యా దీపం ప్రయాచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాంనర కాద్ఘోరా ద్ధివ్యజ్యోతిర్నమోస్తుతే
దీపం ప్రాముఖ్యతను ఈ శ్లోకం చెబుతుంది. మూడు వత్తులను తీసుకుని నూనెలో తడిపి అగ్నిని జతచేసి ముల్లోకాల చీకట్లను పోగొట్టగలిగే దివ్య జ్యోతిని వెలిగిస్తూ దేవుడికి భక్తితో సమర్పిస్తున్నాను అని దీని అర్థం. లోకానికి వెలుగును ఇచ్చేది దీపం. అటువంటి దీపాన్ని మనస్పూర్తిగా దేవుడిని తలుచుకుంటూ వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పని సరిగా 365 వత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు. గుడికి వెళ్ళి వెలిగించలేని వాళ్ళు ఇంట్లోని తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు.
కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈరోజు చాలా మంది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తారు. మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఇది చేయడం వల్ల సకల సంపదలు సొంతం అవుతాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈరోజు దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు దీప దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు జరిగే మరొక అద్భుతమైన ఘట్టం జ్వాలా తోరణం. సాయంత్రం వేళ శివాలయాల దగ్గర జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. శివపార్వతుల పల్లకిని ఈ జ్వాలా తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిప్పుతారు. దీన్ని దాటిన వారికి యమలోక శిక్షలు తప్పుతాయని భక్తుల విశ్వాసం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.