Ugadi festival: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉంటుంది?-what is the meaning of ugadi krodhi nama samvatsaram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Festival: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉంటుంది?

Ugadi festival: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉంటుంది?

HT Telugu Desk HT Telugu
Apr 03, 2024 03:02 PM IST

Ugadi festival: ఈ ఏడాది ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం మొదలు కాబోతుంది. అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అర్థం ఏంటి? ఎటువంటి పరిస్థితులు ఎదురావుతాయో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

క్రోధి నామ సంవత్సరం ఆంటే ఏంటి?
క్రోధి నామ సంవత్సరం ఆంటే ఏంటి?

Ugadi festival: 2024 సంవత్సరంలో ఏప్రిల్‌ 9వ తేదీన చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. శ్రీ క్రోధి నామ సంవత్సరం కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరం.

శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపము, ఆవేశముతో వ్యవహరించెదరని చిలకమర్తి తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయములు, క్రోధములు కలగడం, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికముగా ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.

ఉగాది అంటే ఏంటి?

“ఉగ” అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్ధాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడ అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది ఉగాది అయిందని చిలకమర్తి తెలిపారు. అదే సంవత్సరాది ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల రుతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృ స్వరూపం.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయని చిలకమర్తి తెలియచేశారు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని చిలకమర్తి తెలిపారు.

శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రణి స్మృత్యర్థం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వృత్తాంతం.

శిశిరరుతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూ కుహూ అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతఃకాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు. తలంటు స్నానంచేసి, కొత్తబట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది.

ఉగాది పచ్చడి విశిష్టత

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel