Ugadi 2024: తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి? ఒక్కో పేరు వెనుక ఉన్న ఒక్కో అర్థం ఏమిటంటే-ugadi 2024 date telugu new year names and meanings full list ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2024: తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి? ఒక్కో పేరు వెనుక ఉన్న ఒక్కో అర్థం ఏమిటంటే

Ugadi 2024: తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి? ఒక్కో పేరు వెనుక ఉన్న ఒక్కో అర్థం ఏమిటంటే

Gunti Soundarya HT Telugu
Apr 01, 2024 03:59 PM IST

Ugadi 2024: ఉగాదితో తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. చాంద్రమానం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. వాటి పేర్లు ఏంటి? వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం.

తెలుగు సంవత్సరాల పేర్లు
తెలుగు సంవత్సరాల పేర్లు (freepik)

Ugadi 2024: తెలుగువారి పండుగ ఉగాది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ జరుపుకోనున్నారు . పంచాంగం ప్రకారం ఉగాది నుంచి తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుతం శోభకృత్ నామ సంవత్సరంలో ఉన్నాం. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది.

తెలుగు సంవత్సరాలు ఎన్ని?

తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత మళ్లీ మొదటి నుంచి సంవత్సరం ప్రారంభం అవుతుంది. 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. మొదటి రుతువు వసంతం. మొదటి నెల చైత్ర మాసం. మొదటి తిథి పాడ్యమి. తెలుగు వారికి జనవరి 1 నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.

మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అస్సాం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపుకుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో శోభకృత్ నామ సంవత్సరం ముగిసిపోయి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని అర్థం కోపం కలిగించేదని.

తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ

తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తున్నాము.

తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారం కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇవే.

తెలుగు సంవత్సరాల పేర్లు

  1. ప్రభవ- యజ్ఞాలు అధికంగా జరుగుతాయి
  2. విభవ- సుఖంగా జీవిస్తారు
  3. శుక్ల- సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు
  4. ప్రమోద్యుత- అందరికీ ఆనందాన్ని ఇస్తుంది
  5. ప్రజోత్పత్తి- అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది
  6. అంగీరస- భోగాలు కలుగుతాయి
  7. శ్రీముఖ- వనరులు సమృద్ధిగా ఉంటాయి
  8. భావ- ఉన్నత భావాలు కలిగి ఉంటారు
  9. యువ- వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి
  10. ధాత- అనారోగ్య బాధలు తగ్గుతాయి
  11. ఈశ్వర- క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది
  12. బహుధాన్య- దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది
  13. ప్రమాది- వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి
  14. విక్రమ- పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు
  15. వృష- వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
  16. చిత్రభాను- అద్భుతమైన ఫలితాలు పొందుతారు
  17. స్వభాను- క్షేమము, ఆరోగ్యం
  18. తారణ- మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి
  19. పార్థివ- ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి
  20. వ్యయ- అతివృష్టి, అనవసర ఖర్చులు
  21. సర్వజిత్తు- సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి
  22. సర్వదారి- సుభిక్షంగా ఉంటారు
  23. విరోధి- వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం
  24. వికృతి- ఈ సమయం భయంకరంగా ఉంటుంది
  25. ఖర- పరిస్థితులు సాధారణంగా ఉంటాయి
  26. నందన- ప్రజలకు ఆనందం కలుగుతుంది
  27. విజయ- శత్రువులను జయిస్తారు
  28. జయ- లాభాలు, విజయం సాధిస్తారు
  29. మన్మధ -జ్వరాది బాధలు తొలగిపోతాయి
  30. దుర్ముఖి- ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు
  31. హేవళంబి- ప్రజలు సంతోషంగా ఉంటారు
  32. విళంబి- సుభిక్షంగా ఉంటారు
  33. వికారి- ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది
  34. శార్వరి- పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది
  35. ఫ్లవ- నీరు సమృద్ధిగా ఉంటుంది
  36. శుభకృత- శుభాలు కలిగిస్తుంది
  37. శోభకృత్- లాభాలు ఇస్తుంది
  38. క్రోధి- కోపం కలిగిస్తుంది
  39. విశ్వావసు- ధనం సమృద్ధిగా ఉంటుంది
  40. పరాభవ- ప్రజల పరాభవాలకు గురవుతారు
  41. ఫ్లవంగ- నీరు సమృద్ధిగా ఉంటుంది
  42. కీలక- పంటలు బాగా పండుతాయి
  43. సౌమ్య- శుభ ఫలితాలు అధికం
  44. సాధారణ- సాధారణ పరిస్థితులు ఉంటాయి
  45. విరోధికృత్- ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది
  46. పరీధావి- ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది
  47. ప్రమాదీచ- ప్రమాదాలు ఎక్కువ
  48. ఆనంద- ఆనందంగా ఉంటారు
  49. రాక్షస-కఠిన హృదయం కలిగి ఉంటారు
  50. నల- పంటలు బాగా పండుతాయి
  51. పింగళ- సామాన్య ఫలితాలు కలుగుతాయి
  52. కాళయుక్తి - కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి
  53. సిద్ధార్థి-కార్య సిద్ధి
  54. రౌద్రి- ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి
  55. దుర్మతి- వర్షాలు సామాన్యంగా ఉంటాయి
  56. దుందుభి- క్షేమం, ధ్యానం
  57. రుధిరోద్గారి- ప్రమాదాలు ఎక్కువ
  58. రక్తాక్షి- అశుభాలు కలుగుతాయి
  59. క్రోధన- విజయాలు సిద్ధిస్తాయి
  60. అక్షయ- తరగని సంపద

Whats_app_banner