Nava grahalu: నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? దేవి భాగవతం ప్రకారం నవగ్రహాల విశిష్టత ఏంటి?
Nava grahalu: నవగ్రహాలు మానవ జీవితం మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి. వాటి విశిష్టత ఏంటి? అనే వాటి గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Nava Grahalu: మానవ జీవితాన్ని ప్రభావితం చేసేవి నవగ్రహాలు. ఇవి 1. సూర్యుడు 2.చంద్రుడు 3.కుజుడు (మంగళుడు) 4. బుధుడు 5. గురుడు 6. శుక్రుడు 7. శనీశ్వరుడు 8. రాహువు 9. కేతువు. ఈ గ్రహాలన్నీ ఆకాశంలోని ధృవమండలాన్ని ఆధారంగా చేసుకొని తమ తమ కక్ష్యలలో సంచరిస్తూ మానవుల కర్మ ఫలాలను అనుసరించి వారి జీవితాలలో తమ ప్రభావాన్ని చూపుతుంటాయి. దేవీ భాగవత పురాణంలో ఈ నవగ్రహాల స్థానాలు వాటి సంచారాల గురించి ప్రత్యేకంగా చిలకమర్తి తెలియచేశారు.
సూర్యుడు
ఈ బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు నివాసం ఉంటాడు. సూర్యుడుండే ప్రదేశానికి మన భూగోళానికి మధ్యలో ఇరవై ఐదు కోట్ల యోజనాల దూరం ఉంది. మృతమైన అండం నుంచి జన్మించినందున మార్తాండుడని, ఆ అండం హిరణ్యమైనది (బంగారు) కాబట్టి దానినుంచి ఉద్భవించిన కారణంగా హిరణ్యగర్భుడని సూర్యుడిని పిలుస్తారు. సకల జీవకోటికీ సూర్యుడే ఆధారం. ఆయనే ఆత్మ, ఆయనే వెలుగు, ఆయనే అందరికీ దృష్టి ప్రదాత. ఇలా ఎంతో వైభవంతో తన దివ్యమైన వెలుగులతో అన్ని లోకాలనీ సూర్యుడు ప్రకాశింప చేస్తున్నాడు.
ఉత్తరాయణ కాలంలో సూర్యుడు నెమ్మదిగా సంచరిస్తాడు. అందుకే ఆ కాలంలో పగలు సమయం ఎక్కువ సేపు ఉంటుంది. దక్షిణాయనంలో ఆయన వేగంగా ప్రయాణిస్తాడు కనుక పగటిభాగం తొందరగా జరిగిపోతుంది. నిజానికి సూర్యుడికి ఉదయం అస్తమయం రెండూ లేవు. ఆయన నిత్యం ప్రకాశిస్తూ, ప్రయాణిస్తూ ఉంటాడు. సూర్యుడి రథం ఒక ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాల దూరం ప్రయాణిస్తుంది. సూర్యుడే రుతువులు ఏర్పడటానికి కారణభూతుడవుతున్నాడు. చంద్రాది గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఈయన కాంతితోనే ప్రకాశిస్తూ ఉంటాయని చిలకమర్తి తెలిపారు.
సూర్యభగవానుడి రథానికి ఒకే చక్రం ఉంటుంది. దానికి 12 ఆకులు ఉంటాయి. ఈ పన్నెండు అకులు, పన్నెండు మాసాలకి ప్రతీకగా కనిపిస్తాయి. ఈ రథాన్ని ఏడు ఛందస్సులు, ఏడు గుర్రాలుగా లాగుతుంటాయి. గరుత్మంతుడి అగ్రజుడైన అరుణుడు (మాతలి) సూర్యరథానికి సారథి. ఇలా సూర్యుడు తన రథం మీద నిత్యం పరిభ్రమిస్తూ ఉంటాడు.
చంద్రుడు
కృష్ణపక్షం, శుక్లపక్షం అని మాసాన్ని రెండుగా విభజిస్తూ చంద్రుడు సంచరిస్తాడు. ఈయన సూర్యుడికన్నా ఎక్కువ వేగంతో తిరుగుతుంటాడు. చంద్ర భగవానుడు 27 నక్షత్రాలలో కలిసి ఉండే కాలం ఆధారంగా పన్నెండు మాసాలకి చైత్రము, వైశాఖము అనే పేర్లు ఏర్పడుతున్నాయి.
శుక్షపక్షంలో తన పదహారు కళలతో పెరుగుతూ దేవతలకి, పౌర్ణమి నుంచి క్రమంగా క్షీణిస్తూ కృష్ణపక్షంలో పితృదేవతలకి ఆనందాన్ని కలిగిస్తుంటాడు. సూర్యుడు ఉదయానికి నాయకుడైతే చంద్రుడు రాత్రికి రారాజు. సూర్యుడు ఒక సంవత్సరంలో తిరిగే కాలాన్ని చంద్రుడు ఒక నెలలోనే తిరుగుతాడు. దేవతలకి, పితృదేవతలకి, మనుష్యులకి, బెషధులకి, ప్రాణాన్ని ప్రసాదించేవాడుగా ఉన్న చంద్రుడు సర్వమయుడుగా విఖ్యాతి పొందాడని చిలకమర్తి తెలిపారు.
శుక్రుడు
చంద్రుడికి మూడు లక్షల యోజనాల దూరంలో మేరు పర్వతానికి ప్రదక్షిణంగా చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇరవై ఏడు నక్షత్రాలన్నీ ఈ చక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి. ఈ చక్రానికి పైభాగంలో రెండు లక్షల యోజనాల దూరంలో అంటే చంద్రుడి నుంచి దాదాపు ఐదు లక్షల యోజనాల దూరంలో శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఈయన సూర్యుడికి ముందు వెనకా తిరుగుతుంటాడు. ఈయనకి శీఘ్రగమనం, మందగమనం రెండూ ఉన్నాయి. లోకాలన్నిటికీ శుభాల్ని ప్రసాదించే పవిత్ర స్వరూపుడు శుక్రుడు.
బుధుడు
శుక్రుడికి రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు సంచరిస్తుంటాడు. ఈయన కూడా శుక్రుడితో సమానంగా తిరుగుతుంటాడు. ఈయన సౌమ్యుడు.
కుజుడు
బుధుడికి రెండులక్షల యోజనాల ఎత్తులో అంగారకుడు (కుజుడు) సంచరిస్తూంటాడు. ఈయన మూడు పక్షాలకు ఒక్కోరాశిలో సంచరిస్తుంటాడు. ఈయన వక్రంగా లేకపోతే శుభాల్ని కూడా ప్రసాదిస్తాడని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గురువు
బుధ గ్రహానికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి నివాసముంటాడు. ఈయన ఒక్కో రాశిలో ఒక సంవత్సర కాలం నివసిస్తాడు. ఈయన కూడా వక్రత్వం లేనంత వరకూ శుభాల్ని అందిస్తాడు.
శనైశ్చరుడు
గురువుకి రెండు లక్షల యోజనాల దూరంలో ఉండే ప్రాంతం శనికి నివాసస్థానం. శనైశ్చరుడుగా ప్రసిద్ధి పొందిన శని మందగమనుడు. సూర్యభగవానుడికి స్వయంగా కుమారుడైన శని ముప్పైనెలలకు ఒకసారి చలిస్తాడు. అనగా ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు నివాసముంటాడు. సహజంగా శని అశుభాలు కలిగిస్తుంటాడని చిలకమర్తి తెలిపారు.
ఈ విధంగా పై తెలిపిన గ్రహాలు బ్రహ్మాండంలో సంచరిస్తూ జీవుల కర్మనుసారంగా వారికి సుఖదుఃఖాలని కలిగిస్తూ ఉన్నాయి. అయితే మహాపురుషుడై పరమాత్మని “నమో జ్యోతిర్లోకాయ కాలాయానిమిషాం పతయే మహాపురుషాయ ధీమహి” అనే మంత్రంతో ప్రతిరోజు కనీసం 108 సార్లు స్మరిస్తే ఆయన అనుగ్రహంతో గ్రహాలు, నక్షత్రాలు కలిగించే బాధల నుంచి మానవులకి ఎంతో ఉపశమనం లభిస్తుందని దేవీభాగవతం చెబుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.