Maha shivaratri 2024: లింగోద్భవ కాలమంటే ఏమిటి? శివరాత్రి విశిష్టత ఏమిటి?-what is lingodbhava kaala what is special about shivratri ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri 2024: లింగోద్భవ కాలమంటే ఏమిటి? శివరాత్రి విశిష్టత ఏమిటి?

Maha shivaratri 2024: లింగోద్భవ కాలమంటే ఏమిటి? శివరాత్రి విశిష్టత ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Mar 07, 2024 01:57 PM IST

Maha shivaratri 2024: లింగోద్భవ కాలం అంటే ఏంటి? మహా శివరాత్రి విశిష్టత ఏంటి? శివార్చన చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

లింగోద్భవ కాలం అంటే ఏంటి?
లింగోద్భవ కాలం అంటే ఏంటి? (pixabay)

Maha shivaratri 2024: శివునికి అత్యంత ప్రీతికరమైన, భక్తులకు అత్యంత శ్రేష్టమైన పర్వదినం మహాశివరాత్రి. ఈ పండుగ శాస్త్రం ప్రకారం మాఘ మాస కృష్ణ పక్షం చతుర్థశి తిథిన వస్తుంది.

ముపోషితః అర్ధరాత్రేచ జననం జాత శృంభు స్వయం హరః

మాఘ మాసంలో కృష్ణ పక్షంలో అర్ధరాత్రి చతుర్దశి ఏ రోజు వ్యాప్తమై ఉంటుందో అదే మహాశివరాత్రి. ఈ సంవత్సరం తేదీ 8-3-2024 శుక్రవారం రోజున అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం అవుతుందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కృతేతుమణిమయ లింగం త్రేతాయాం స్పటికాకారః

ద్వాపరే పారదం ఠేష్టం పార్ధివంతు కలౌయుగే

కృతయుగంలో మణిమయ లింగానికి, త్రేతాయుగంలో స్పటిక లింగానికి, ద్వాపర యుగంలో పాదరస లింగానికి, కలియుగంలో పార్థివ లింగానికి పూజ చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రం చెబుతుందని చిలకమర్తి తెలిపారు.

పూర్వకాలంలో మహాప్రళయంలో సంగమ స్థావరాత్మకమైన జగమెల్ల నశించి ఒక్కటే మహాసముద్రంగా ఉండినప్పుడు ఈశ్వర రూపం, తేజోమయంబు, జరామరణ రహితంబు, గుణత్రయాత్మకంబు అగు మూల ప్రకృతియే లింగం. పరమేశ్వరుడు ఆ ప్రకృతితో కూడి సృష్టి స్థితిలయములు చేస్తాడు.

కావున జన్మపాశ నివృత్తికై శివశ్శక్య్యాత్మకమైన లింగార్చన చేయాలి. ఇట్టి మహాలింగార్చన దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి రోజు ప్రదోషకాలంలో అత్యంత వైభవోపేతంగా పార్ధివ మహాలింగార్చన జరుగునని చిలకమర్తి తెలిపారు.

పార్థివలింగాన్ని ఆరాధించడంవల్ల అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి. మానవులు మోక్షాన్ని పొందవచ్చు. వేదంలో కూడా ‘మృత్తికే హనమే పాపం యన్మయా దుషుతం కృతం’ అని ఉంది. పార్ధివలింగానికి పూజ చేయడంవల్ల సమస్త పాపాలు నశిస్తాయి.

శివలింగార్చన చేసే భక్తుడు చిదానంద రూపుడైన శివుడిని నేనే అనే భావంతో ఈశ్వరుని అర్చించాలి. శివోహం అన్న భావన కలిగి ఉండాలి. పార్ధివలింగంలో మాత్రమే ఇట్టి భావన చేకూరును.

మానవ శరీరాలు పంచ భౌతికమైనవి. పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశః.... ఆకాశం, వాయువు, అగ్ని నీరు, పృథ్వి. వీటికి ఐదు గుణాలు‌ తత్వాలు కలవు. అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే గుణాలు కలవు. మనం మాట్లాడడం వల్ల శబ్ద గుణం, ఒక వ్యక్తిని తాకడం వల్ల స్పర్శ గుణం, కళ్ళతో చూడడం వల్ల రూప గుణం, నాలికతో రుచులు తెలుసుకోవడం వల్ల రస గుణం, నాసిక ద్వారా సువాసన దుర్వాసన తెలుసుకోవడం వల్ల గంధ గుణాన్ని కలిగి ఉన్నాం.

పంచభూతాలు ఒకదాని నుండి ఒకటి ఉద్భవించిందని వేదం చెబుతుంది. ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృధ్వి, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీరు నుండి పృధ్వి ఉద్భవించడం వల్ల ఐదు గుణాలు మట్టిలో ఉంటాయి. ఐదు గుణాలు మన శరీరంలో ఉంటాయి. చివరికి ఈ సమస్త శరీరాలు మట్టిలోనే కలుస్తాయి. కావున పార్ధివలింగార్చన శివోహం అనే భావానికి ప్రతీక.

మహాలింగార్చనలో 366 లింగాలు ఉంటాయి. ఇట్టి లింగాలు అంగుష్ట ప్రమాణంలో తయారు చేసుకుంటాం. సంవత్సరంలో ఒక్క మారు ఈ పూజ చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా ఈశ్వరారాధన చేసి ఈశ్వరునికి దీపం వెలిగించిన ఫలితం కలుగుతుంది. ఈతి బాధలు, గ్రహ బాధలు, వాస్తు బాధలు తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner