Camphor: కర్పూరాన్ని వీటితో కలిపి ఇంట్లో కాల్చండి.. ఆర్థిక సమస్యలకు ఫుల్ స్టాప్ పడిపోతుంది-surprising benefits of camphor and bay leaves to remove negative energy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Camphor: కర్పూరాన్ని వీటితో కలిపి ఇంట్లో కాల్చండి.. ఆర్థిక సమస్యలకు ఫుల్ స్టాప్ పడిపోతుంది

Camphor: కర్పూరాన్ని వీటితో కలిపి ఇంట్లో కాల్చండి.. ఆర్థిక సమస్యలకు ఫుల్ స్టాప్ పడిపోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 12, 2024 12:42 PM IST

Camphor: కర్పూరంతో కొన్ని వస్తువులు కలిపి ఇంట్లో కాల్చడం వల్ల ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. జాతకంలో గ్రహాల స్థానం బలపడుతుంది. అటువంటి సింపుల్ రెమిడిస్ ఏంటో చూసేయండి.

కర్పూరంతో పాటించాల్సిన నివారణలు
కర్పూరంతో పాటించాల్సిన నివారణలు (freepik)

Camphor: పూజలో తప్పనిసరిగా కర్పూరం ఉంటుంది. దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వెలిగిస్తారు. హిందూ ధర్మ శాస్త్రంలో కర్పూరానికి అధిక ప్రాధన్యత ఉంటుంది. ప్రక్షాళన, పవిత్రమైన లక్షణాలు ప్రతికూల శక్తులను బయటకు పారద్రోలుతాయి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.

వాస్తు ప్రకారం కూడా కర్పూరం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో లేదా కార్యాలయంలో కర్పూరాన్ని కాల్చడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి. సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఏకాగ్రత, ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. దీని సువాసన ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల శ్రేయస్సు, ఆనందానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఇంట్లోని వాస్తు దోషాలను పోగొట్టుకునేందుకు, సంపదను పెంచుకునేందుకు కర్పూరంతో కొన్ని నివారణలు పాటించడం మంచిది. ఇవి అనుసరించడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇల్లంతా విస్తరించేలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. కర్పూరంతో పాటించాల్సిన రెమిడీలు తెలుసుకుందాం.

పాజిటివ్ ఎనర్జీ కోసం

కర్పూరాన్ని కాల్చడం వల్ల పవిత్రమైన శక్తులు ఇంట్లోకి ప్రవేశించి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది పురాతన కాలం నుంచి ఆచరిస్తున్న సంప్రదాయం. సాయంత్రం వేళ కర్పూరం కాలిస్తే శ్రేయస్సు, విశ్రాంతికి అనుకూలంగా ఉంటుంది. సామరస్యం పెంపొందించుకోవచ్చు. దీని నుంచి వెలువడే సువాసన ప్రతికూలతను ఇంట్లో వ్యాపింపజేస్తుంది. శుభ ప్రకంపనలు సృష్టిస్తుంది.

దోషాలు తొలగిపోయేందుకు

జాతకంలో ఏర్పడిన దోషాలు తొలగించుకునేందుకు కర్పూరంతో వివిధ వస్తువులు కలిపి కాల్చడం శ్రేయస్కరం. లవంగాలు కర్పూరం కాల్చడం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రభావవంతమైన పరిష్కారం. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దోషాలు తొలగిపోతాయి.

గ్రహాలను బలపరిచేందుకు

యాలకులతో కలిపి కర్పూరాన్ని కాల్చడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో బుధుడి స్థానం బలపడుతుంది. అలాగే దాల్చిన చెక్కతో కలిపి కాలిస్తే శుక్ర, కుజ గ్రహాలు బలపడతాయి. పనిలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించుకోవచ్చు. కర్పూరంతో బిర్యానీ ఆకులను కలిపి కాల్చి ఆ పొగను ఇల్లంతా వేయండి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అది మాత్రమే కాదు ఈ రెమిడీ వల్ల రాహువు దుష్ప్రభావాలు తొలగిపోతాయి.

ప్రతికూలతను తిప్పికొట్టేందుకు

కర్పూరానికి ప్రతికూల శక్తులని తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. వాటికి వ్యతిరేకంగా ఇంట్లో రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లోని హానికరమైన శక్తులు బయటకు పోతాయి. దుష్ట ఆత్మలు ఇంట్లోకి ప్రవేశించలేవు. కర్పూరానికి ఉన్న శుద్ధి చేసే లక్షణాలు ఇంట్లో ప్రశాంతతను నెలకొల్పుతాయి.

సంపదను ఆకర్షిస్తుంది

సాయంత్రం పూట ఇంటి ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. రెండు లవంగాలతో కలిపి కాల్చి ఆ పొగను ఇల్లు మొత్తం వ్యాపింప చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్