Good luck idols: మీ ఇంట సంతోషాన్ని, సంపదను పెంచుకునేందుకు ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకోండి
Good luck idols: వాస్తు ప్రకారం దేవతలు, దేవుళ్ళ విగ్రహాలతో పాటు ఇవి కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. ఇవి ఇంటికి సంతోషాన్ని సంపదను తీసుకొస్తాయి. మీకు డబ్బు కొరత తీరుతుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
Good luck idols: వాస్తు ప్రకారం ఇంటి అలంకరణ, సానుకూల శక్తులను పెంచడానికి దేవతలతో సహ అనేక విగ్రహాలని ఇంటికి తీసుకురావడం అదృష్టంగా భావిస్తారు. ఇవి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు అదృష్టాన్ని ఇస్తాయి. ఇంట్లో సానుకూలతను పెంచుకునేందుకు వాస్తు ప్రకారం కామధేను విగ్రహాన్ని ఉంచడం శ్రేయస్కరంగా భావిస్తారు. హిందూ మతంలో గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారని చెబుతారు.
పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో కామధేనువు ఉద్భవించింది. కోరికలు తీర్చే కామధేనువులో లక్ష్మీదేవి( సంపద), సరస్వతి( జ్ఞానం), దుర్గాదేవి(శక్తి ) ఉంటారని నమ్ముతారు. అటువంటి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సామరస్య వాతావరణాన్ని పెంపొందించేందుకు శక్తివంతమైన చిహ్నంగా పని చేస్తుంది. అయితే వాస్తు ప్రకారం ఈ విగ్రహాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
కామధేనువు విగ్రహం
ఈశాన్య దిశ ఇంటికి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతం సాంప్రదాయకంగా దేవతల కోసం ప్రత్యేకించబడిన ప్రదేశం. లేదంటే ఈ విగ్రహాన్ని ఇంటి ఉత్తర లేద తూర్పు భాగాలలో ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించారు. ప్రత్యేకంగా పూజ గది ఉన్న ఇళ్ళలో కామధేనువు విగ్రహాన్ని ఉంచడానికి అనువైనది. వెండితో చేసిన కామధేను విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సానుకూల శక్తులను కాపాడుతుంది. ఇంట్లో ఇత్తడితో చేసిన ప్రతిష్టించడం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగిపోతుంది. ఆనందం, శ్రేయస్సు వస్తుంది. ఆరోగ్యం, సంపదను ఇస్తుంది.
వాస్తు ప్రకారం కామధేను విగ్రహాన్ని పడకగదిలో ఉంచకూడదు. ఇది అశుభకరమైనదిగా పరిగణిస్తారు. బెడ్ రూమ్ లు విశ్రాంతి కోసం కేటాయించబడినవి. అందుకే ఈ రూమ్ లో వీటిని పెట్టుకోకపోవడమే మంచిది. లేగదూడతో ఉన్న కామధేనువు విగ్రహం ఇంట్లో ఉండటం చాలా మంచిది. ఆర్థిక సంబంధమైన సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. దీనితో పాటు వాస్తు ప్రకారం మరికొన్ని విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు.
తాబేలు విగ్రహం
వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలును ఉంచడం చాలా మంచిది. ఇది ధన ప్రవాహానికి అవకాశాలను పెంచుతుంది. విజయ మార్గంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. ఇది ఇంట్లో పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
చేపలు
వాస్తు ప్రకారం ఇంట్లో లోహపు చేపల జతలను ఉంచడం చాలా శుభప్రదం. దీన్ని పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. సంపదను పెంచుకునేందుకు మీరు ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేపల విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. చేపల అక్వేరియం కూడా ఉంచుకోవచ్చు.
హంస జత
వాస్తు ప్రకారం ఒక జత హంసల విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. సంపద, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు పడకగదిలో ఒక జత హంస విగ్రహాన్ని ఉంచుకోవచ్చు.
ఏనుగు
వాస్తు ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది. దీని వల్ల ఇంట్లో సంపద, సౌభాగ్యం పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు నిండిపోతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్