కార్తీక మాసంలో కనీసం ఈ నియమాలు ఆచరించాలంటున్న చిలకమర్తి
కార్తీక మాసంలో నిత్య పూజలు ఆచరించకపోయినా కనీస ధర్మంగా కొన్ని నియమాలు పాటిస్తే మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరిస్తున్నారు. ఆ నియమాలేంటో మీరూ చూడండి.
కార్తీక మాసం ఆచరించే నియమాలు పాపవిముక్తి కోసం, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, భక్తిని పెంపొందించుకోవడానికి, మోక్షమార్గమును సంపాదించుకోవడానికి అతి ఉత్తమమైన మార్గమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇటువంటి ఉత్తమమైన కార్తీకమాసంలో నేటి ఆధునిక సమాజంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ప్రస్తుత సమాజ సామాజిక జీవన విధానం వలన కార్తీకమాస దీక్షలు, వ్రతాలు ఆచరించలేనటువంటివారు కనీసం ఆచరించవలసిన విషయాల గురించి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దీపారాధన - దీపదానం
కార్తీక మాసంలో ప్రతీరోజూ ఇంటిలో గాని, గుడియందు గాని ఉదయము, సాయంత్రం లేదా కనీసం ప్రదోష కాల సమయంలో నువ్వుల నూనెతో గానీ, ఆవు నేతితో గాని దీపాలను వెలిగించాలి. ఇదీ కూడా సాధ్యపడని పక్షంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటివారు కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథధులయందు దీపాలను వెలిగించాలి.
శివుని వద్ద, విష్ణువు వద్ద దీపం వెలిగించడం, తులసికోట వద్ద ఆకాశదీపం వెలిగించడం, అలాగే దీపదానం వంటివి చేయడం వలన కార్తీక మాస దీప పుణ్య ఫలం లభిస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీక స్నానం
కార్తీక మాసంలో ప్రతీరోజూ ఖచ్చితంగా స్నానమాచరించాలి. కార్తీకమాసంలో గంగా, యమున, గోదావరి, కృష్ణా, కావేరి వంటి పుణ్యనదులలో స్నానం లేదా సముద్ర స్నానం వంటివి ఆచరించాలి. విశేషంగా ఈ పుణ్యనదీ స్నానాలు సంకల్పసహితంగా ఆచరించాలి. ఈ పుణ్యనదీ స్నానాలను కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి తిథులలో ఆచరించడం ఉత్తమమని పురాణాలు తెలియచేస్తున్నాయి.
ఇలా కూడా కుదరని పక్షంలో కార్తీకమాసంలో ఏదో ఒక్క రోజైన పుణ్యనదీ స్నానం సంకల్పం తర్పణం దానం వంటివి ఆచరించడం వల్ల కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.
శివారాధన
కార్తీకమాసంలో ప్రతీరోజూ శివారాధన చేయడం విశేషమైనటువంటి పుణ్యఫలం. ఏ కారణంచేతనైనా ఇలా కుదరని పక్షంలో కార్తీక సోమవారాలు, త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి తిథులలో శివాలయాలలో లేదా స్వగ్భృహమునందు శివునికి పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవాలి.
శివుడిని బిల్వ దళాలతో పూజించుకోవడం మంచిది. ఇది కూడా కుదరని పక్షంలో ఇంటియందే శివలింగానికి అభిషేకం పూజ వంటివి చేసుకోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు.
క్షీరాబ్ది ద్వాదశి వ్రతం
కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున శివాలయాలను, విష్ణువు ఆలయాలను దర్శించడం, ఆరోజు సాయంత్రం ఇంటివద్ద గుడుల వద్ద గోశాలలో నదీపరివాహక ప్రాంతాలలో దీపాలను వెలిగించడం, సాయంత్రం సమయంలో తులసి మరియు ఉసిరి మొక్కలను పెట్టుకుని వాటిని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల, అలాగే ఈరోజు ఆకాశదీపాలు, 365 వత్తులతో దీపాలను వెలిగించడం వలన కార్తీక మాస పుణ్యఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.
కార్తీక మాసంలో రోజుతో నిమిత్తం లేకుండా ఏ రోజైనా భక్తిశద్ధలతో స్నాన, దాన, జప, తపాదులు దీపారాధన, శివారాధన మరియు విష్ణు ఆరాధన, కార్తీక పురాణ పఠనం వంటివి ఆచరించడం వల్ల వారికి కార్తీక మాస పుణ్యఫలం లభించి శివకేశవుల అనుగ్రహం చేత సుఖ సౌఖ్యములు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్ : 9494981000