Danam- Dharmam । అష్టదానాలు అనగానేమి? అన్ని దానాలకు మించిన దానం అదే!
Danam- Dharmam: అష్టదానాలు చేస్తే ఎన్నో గొప్ప పుణ్యఫలాలు లభిస్తాయని పురాణశాస్త్రాలు చెబుతున్నాయి. అష్టదానాల గురించి ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Danam- Dharmam: సనాతన హిందూ ధర్మంలో దానధర్మాలకు (Donations - Charity) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకరికి దానం చేయడం వలన అది ఎన్నో పుణ్య ఫలితాలను అందిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే. అన్నదానం చేసి ఒకరి ఆకలి బాధలు తీర్చడం లేదా పశుపక్షాదులకు ఆహారం పెట్టడం వలన నేరుగా మోక్షం పొందవచ్చు అని పురాణశాస్త్రాలు చెబుతున్నాయి.
అయితే ఈ దానాలలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టదానాలు చేస్తే కష్టాలన్నీ తీరిపోయి, అనేక రకాల పుణ్యఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఈ అష్టదానాల గురించి ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
సనాతన ధర్మంలో దానధర్మాదులకు ప్రత్యేక స్థానము కలదు అని ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నవగ్రహాల అనుకూలతలో గ్రహశాంతులలో దానమునకు విశేషమైనటువంటి స్థానమున్నది. అష్టదానాలకు మన సనాతన ధర్మంలో గరుడ పురాణం ప్రకారం విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నట్టుగా చిలకమర్తి తెలిపారు.
అష్టదానాలు అనగానేమి?
అష్టదానాలు అనగానేమి?, ఏ దానమునకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంది, ఆయా దానములు చేసినచో ఎలాంటి ప్రయోజనములు కలుగునో ఇప్పుడు తెలుసుకుందాం. అష్ట దానములు అనగా 8 రకాల దానములు, అవి..
1. నువ్వులు
2. ఇనుము
3. బంగారం
4. పత్తి
5. ఉప్పు
6. భూమి
7. ఆవులు
8. ఎనిమిదవ దానంగా ఏడు ధాన్యాలు కలపి (గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు) చేయాలి.
నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనివారం నువ్వులు దానం చేయడం ద్వారా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. శనివారం శనీశ్వరుని ముందు ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. ఈ రోజున నల్లని వస్త్రాలను దానం చేసి నల్లటి శునకానికి ఆహారం అందించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి.
ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోవచ్చుననేది శాస్త్రం చెప్తోన్న మాట. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరని చెప్తారు.
భూమిని దానం చేయడం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి.సువర్ణ దానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించి అప్లైశ్వర్యాలను ప్రసాదిస్తారు. పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భయం ఉండదు.
ఉప్పు దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు.
గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు, అంటే సకల దేవతలు కొలువైన ఆవుని దానం చేయడం ద్వారా స్వర్గలోకం ప్రాప్తి.
ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను కలపి దానం చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోవడమే కాదు, యమ బాధలుండవని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
సంబంధిత కథనం
టాపిక్