Hell and Heaven | స్వర్గానికి దారేది..? సాధువు చెప్పిన సత్యం ఇదే!-want to know the way to heaven and hell read this interesting story ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hell And Heaven | స్వర్గానికి దారేది..? సాధువు చెప్పిన సత్యం ఇదే!

Hell and Heaven | స్వర్గానికి దారేది..? సాధువు చెప్పిన సత్యం ఇదే!

Manda Vikas HT Telugu
Dec 01, 2022 04:47 PM IST

Hell and Heaven: ఒక యువకుడికి స్వర్గానికి వెళ్లిరావాలనే కోరిక కలిగింది. ఇందుకోసం స్వర్గానికి వెళ్లే మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాడు. మరి దారి దొరికిందా? కథ లోపలికి వెళ్లండి..

Way to the Hell and Heaven
Way to the Hell and Heaven (Pixabay)

మనం మన జన్మలో చేసే పాపపుణ్యాలు, కర్మల అనుసారంగానే మనకు స్వర్గం లేదా నరకం లభిస్తుందని నమ్ముతాం. పురాణకాలం నుంచి స్వర్గం, నరకం అనే రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్నాయని విశ్వసిస్తాం. స్వర్గంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అప్సరసలతో స్వర్గ సుఖాలను అనుభవిస్తే, నరకం తీవ్రమైన వేడితో భయంకరంగా ఉంటుందని అక్కడ ఎవరూ ఉండలేరని మనం ఎన్నో కథలు వింటూ పెరిగాం. ఎవరైనా స్వర్గానికి వెళ్లాలనే కోరుకుంటారు, నరకానికి ఎవరూ వెళ్లాలనుకోరు.

మరి స్వర్గం, నరకం ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? చాలా సందర్భాల్లో స్వర్గం అంతరిక్షంలోని ఇంద్రలోకంలో, నరకం పాతాళంలో ఉందని చెప్పడమైనది. అసలు ఇవి నిజంగా ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి, ఇందులో స్వర్గానికి వెళ్లే దారేది అని తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికే ఉంటుంది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి...

Let's Get into Hell and Heaven- స్వర్గానికి దారేది..!

స్వర్గం గురించి చాలా కథలు విన్న ఓ యువకుడు అక్కడకు ఒక్కసారైనా వెళ్లాలలని అనుకుంటాడు, అలాగే నరకం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలనుకుంటాడు. ఇదే విషయమై అతడు ఒకరోజు ఒక సాధు సంతువు దగ్గరకు వెళ్తాడు. సాధువును యువకుడు ఆశగా ప్రశ్నిస్తూ 'స్వామి.. స్వర్గానికి దారి ఎటువైపు ఉంది, అక్కడకు వెళ్లాలంటే ఏం చేయాలి? అదే విధంగా నరకం ఎక్కడ ఉంది, అటువైపు వెళ్లకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు' అని అడుగుతాడు.

అప్పుడు ఆ సాధువు ఆ యువకుడిని ఎగాదిగా చూసి 'నాయనా, ఇంతకీ నువ్వు ఏం పని చేస్తున్నావు' అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు 'నేను సైనికుడిని' అంటూ గర్వంగా చెబుతాడు. అప్పుడు సాధువు మళ్లీ ఆ యువకుడిని ఎగాదిగా చూసి 'నీ మొఖానికి నువ్వు సైనికుడివా, నీ అవతారం చూసే ఒకరకంగా కామపిశాచిలా ఉన్నావు, నీలో ఒక్కటి కూడా మంచి లక్షణం కనిపించడం లేదు' అని అంటాడు. అప్పుడు ఆ యువకుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు 'ఎంత నీచంగా మాట్లాడుతున్నావు, నేను నీకు సైనికుడిలా కనిపించడం లేదా? నా శక్తి చూపించమంటావా?' అంటూ ఒక కత్తిని బయటకు తీస్తాడు.

అప్పుడు సాధువు 'ఏమిటిది ఇది కత్తా, ఇంత మొండిగా ఉంది, ఇది కూరగాయలను నరకటానికి కూడా పనిచేయదు, దీంతో నువ్వేం చేయగలవు' అని బదులిస్తాడు. ఈ మొండి కత్తితో వచ్చి సైనికుడివని చెప్పుకుంటావా అంటూ హేళన చేస్తాడు. దీంతో వీరావేశంతో ఊగిపోయిన ఆ యువకుడు సాధువును చంపడానికి కత్తిఎత్తి ముందుకు దూసుకొస్తాడు. అప్పుడు సాధువు 'నరకం అంటే ఇదే.. విచక్షణను తీసి నిన్ను బలిపశువును చేసేదే నరకం' అని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశం తగ్గించుకున్న యువకుడు తాను ఏం చేయడానికి ప్రయత్నించాడో గ్రహిస్తాడు. వెంటనే సాధువుకి నమస్కరించి, కత్తిని లోపల పెడతాడు. అప్పుడు సాధువు 'అదే స్వర్గం' అని బదులిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన యువకుడు చాలా స్వస్థతగా భావిస్తాడు.

ఇక్కడ సారాంశం ఏమిటంటే, స్వర్గం, నరకం అంటూ ఎక్కడో ప్రత్యేకంగా ఏమి లేవు. కోపోద్రేకాలు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాయి. క్రోదంతో మనసు రగిలిపోతుంది, ఆ కోద్రాన్ని వీడినపుడు మనసు తేలికవుతుంది. మన భావోద్వేగాలతో మనం చేసే కర్మలే మనకు స్వర్గం, నరకం అందిస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం