Karthika Masam 2022 । కార్తీక మాసంలో పుణ్యస్నానం ప్రాముఖ్యత.. ముఖ్యమైన తేదీలు!
Karthika Masam 2022- Holy River Bath: కార్తీకమాసంలో నదీ స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం, అయితే పుణ్యస్నానాలు ఆచరించటానికి ముఖ్యమైన తేదీలు ఏవి? ఎక్కడ స్నానం ఆచరించాలి మొదలైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Karthika Masam 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీక స్నానంలో సమీపంలోని నదులలో పుణ్యస్నానాలను ఆచరించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కారీక స్నానాల వలన శరీరం, మనసు పరిశుద్ధమై పాప పరిహారం లభిస్తుందని, సర్వపాపాలు తొలగిపోతాయనీ భక్తులు విశ్వసిస్తారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించడం ఆనవాయితీ. అలాగే శివాలయంలో శివునికి పత్రం, పుష్పం, ఫలం సమర్పిస్తారు.
ఈ ఏడాది నవంవర్ 23 వరకు కార్తీక మాసం కొనసాగుతుంది, అయితే కార్తీక పౌర్ణమి వరకే పుణ్యసానానాలు ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 8న వస్తుంది.
నవంబర్ 4న కార్తీక ఏకాదశి, నవంబర్ 5న కార్తీక ద్వాదశి, నవంబర్ 7న వైకుంఠ చతుర్ధశి, నవంబర్ 8న కార్తీక పౌర్ణమి. ఈ తేదీలు కార్తీక మాస పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ముఖ్యమైన రోజులుగా ఉన్నాయి.
పుణ్యస్నానానికి ముందు ఉచ్చరించాల్సిన మంత్రం
కార్తీక మాసంలో నదిలో పవిత్ర స్నానం చేసే ముందు, ఈ మంత్రాలను జపించాలి.
నమః కమలనాభాయ నమస్తే జలసాయినే |
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
కార్తికేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన |
ప్రీత్యర్థం తవ దేవేష్ దామోదర మహాశయ ||
ధ్యాత్వాహం తవం చ దేవేష్ జలేస్మిన్ స్నాతు ముద్యతః |
తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు ||
కార్తీక మాసంలో నదీ స్నానం ప్రాముఖ్యత
కార్తీక స్నానంలో వేకువఝామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ తీరానికి వెళ్లి చన్నీటి స్నానం ఆచరించాలి. ఇది ఒక ఆధ్యాత్మికపరమైన ఆచారం అయినప్పటికీ, దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. కార్తీకమాసం అనేది వర్ష రుతువు ప్రభావం కనుమరుగై, శీతాకాలంలోకి ప్రవేశించే సంధి సమయం. ఈ కాలంలో చంద్రుడు కూడా భూమికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన శరీరం కూడా మలుచుకోవాలనే ఉద్దేశ్యంతో పెద్దలు ఈ ఆచారం తీసుకొచ్చినట్లు చెబుతారు.
కార్తీక మాసంలో పవిత్ర గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించాలి. అయితే ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు సమీపంలో ఉండే నదులు కూడా గంగానది స్వరూపాలే. కాబట్టి మనకు దగ్గర్లో ఉన్న గోదావరి, కృష్ణా నదీతీరాలు, వాటి ఉపనదులు లేదా సమీపంలోని పారే కాలువలు, జలపాతాలు, సరస్సులు ఎక్కడైనా ఆచరించవచ్చు. బయటకు వెళ్లి నదీస్నానం ఆచరించే వీలు లేనప్పుడు ఇంట్లోనే శాస్త్రోక్తంగా కార్తీక పుణ్య స్నానం ఆచరించాలి. శివునికి పూజ చేసుకోవాలి.