Karthika Masam 2022 । కార్తీకమాసంలో దీపం ఎందుకు వెలిగిస్తారు, శివ పూజ ప్రాముఖ్యత తెలుసుకోండి!
Karthika Masam 2022: కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివ పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కారీకదీపం వెలిగించడం ఈ మాసంలో మరో ముఖ్యమైన ఘట్టం. పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Karthika Masam 2022: హిందూ క్యాలెండర్‌లో కార్తీకం చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఇది దీపావళితో మొదలై కార్తీక అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఏడాది పంచాంగం ప్రకారం అక్టోబర్ 25న పాడ్యమి తిథి ముగిసిన తర్వాత కార్తీక మాసం 2022 ప్రారంభమైంది. ఈ మాసం నవంబర్ 23 వరకు కొనసాగనుంది.
ఈ మాసమంతా శివుడిని ఎంతో భక్తి, శ్రద్ధలతో కొలుస్తారు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టును కల్పవృక్షంగా భావించి పూజలు చేస్తారు. ఈ పవిత్ర మాసంలో పరమ శివుడు, మహా విష్ణువు కలిసి ఉంటారని నమ్ముతారు, అందువల్ల దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు.
కార్తీక మాసంలోని ప్రతి సోమవారం శివునికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. సోమ అంటే శివుడికి మరో పేరు కూడా. సోమ అంటే చంద్రుడుని తలపై ధరించడం వలన సోమేశ్వరుడిగా శివుడు పూజలందుకుంటాడు. అందుకే కార్తీక సోమవారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ పవిత్ర మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం, శివునికి ప్రార్థనలు చేయడం, రుద్రాభిషేకం, బిల్వపూజలు చేయడం అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల గొప్ప పుణ్యాలు లభిస్తాయి, పాపాల నుంచి విముక్తి పొందుతాము, మోక్ష సిద్ధి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Karthika Masam 2022- కార్తీక దీపోత్సవం
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక దీపోత్సవం దీపాలను వెలిగించడానికి సూచిక. ఇక్కడ దీపం మన శరీరం అయితే, వెలిగే కాంతి మన ఆత్మ. అంటే మనలోని ఆత్మను వెలిగించటానికి ఇది ప్రతీక.
మనిషి తన అజ్ఞానంతో కోపం, ద్వేషం, దురాశ, అసూయ, పగ వంటి అనేక రకాల ప్రతికూలతలను తన దేహంలో నింపుకుంటాడు. వాటన్నింటినీ త్యజించి ఆ చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పటమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశ్యం.
కార్తీక దీపం వెలిగించి మన మనస్సును శుభ్రపరచమని భగవంతుని కోరతాం. ఈ దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుండి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చేయటానికి చేస్తాము. ఇది మన ఆత్మ జ్ఞానాన్ని పెంచి, మంచి ఆలోచనలతో అంతర్గత సాక్షాత్కారానికి మార్గాన్ని చూపుతుంది, మంచి వ్యక్తులుగా ఎదగడానికి గొప్ప అవకాశాన్నికలిగిస్తుంది. స్వచ్ఛమైన ఆత్మ, స్వచ్ఛమైన మనస్సే నిజమైన ఆనందానికి మూలం అని ఈ కార్తీకదీపం మనకు బోధిస్తుంది.
కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత
కార్తీక పౌర్ణమి రోజున, మహా శివుడు భూమిపైకి దిగి, మొత్తం విశ్వంతో ఏకమవుతాడని నమ్ముతారు. మొత్తం ఈ చరాచర ప్రకృతి పరమాత్మతో ఏకమవుతుంది. ఈ రోజున 365 బట్టీలతో నెయ్యి దీపాలు వెలిగిస్తే, సంవత్సరంలో ప్రతి రోజు దీపం వెలిగించినట్లే. కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరం, మనస్సు శుభ్రపడతాయి. మనస్సు శుభ్రపడినపుడు శివుడి అనుగ్రహం లభించినట్లే. ఇది కొత్త శక్తిని పునరుద్ధరిస్తాయి. అన్నం, బెల్లం, పండ్లు, పాల రూపంలో బ్రాహ్మణులకు నైవేద్యాలు ఇవ్వాలి. శివుడు భూమిపై వస్తాడు కాబట్టి, ఈ కార్తీక పౌర్ణమి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు వెళ్లి పరమశివుడి దర్శనం చేసుకుంటారు. ఓం నమః శివాయ స్మరణతో శివాలయాలు మారుమ్రోగుతాయి.
ఈ పవిత్ర కార్తీక మాసాన్ని అంతే పవిత్రతతో, భక్తితో జరుపుకుందాం. భగవంతుని కృప, కటాక్షాలు అందరిపై సమృద్ధిగా ఉండాలని కోరుకుందాం.
టాపిక్