Pawan Kalyan vs Udhayanidhi Stalin: ‘సనాతన ధర్మం’ పై ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘సనాతన ధర్మం’ వైరస్ లాంటిదని, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తవిస్తూ, గురువారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే.. వారే తుడిచిపెట్టుకుపోతారని పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గురువారం హెచ్చరించారు. దీనిపై స్టాలిన్ ను శుక్రవారం విలేకరులు ప్రశ్నించగా.. ఆయన నవ్వుతూ.. ‘‘వెయిట్ అండ్ సీ.. వెయిట్ అండ్ సీ’’ అని స్పందించారు. "సనాతన ధర్మం" మలేరియా, డెంగ్యూ లాంటిది అని గత ఏడాది తాను చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్ గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ పై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం పై విధంగా నాలుగు పదాల్లో ప్రతిస్పందించారు.
కాలినడకన ఏడు కొండలు ఎక్కి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘‘సనాతన ధర్మం' అనేది వైరస్ లాంటిదని మీరు అంటున్నారు. దానిని నాశనం చేస్తామని చెబుతున్నారు. ఈ మాట ఎవరు చెప్పినా.. వారికి నా సమాధానం ఒక్కటే. మీరు 'సనాతన ధర్మాన్ని' తుడిచిపెట్టలేరు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీరే తుడిచిపెట్టుకుపోతారు" అని కాషాయం ధరించిన పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. ‘‘డీఎంకే ఏ మతం గురించి, లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు. అయితే కుల దురాగతాలు, అంటరానితనం మొదలైన దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తుంది’’ అన్నారు. “మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ లు.. వాళ్లే అసలైన శత్రువులు.. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన కోట్లాది మంది దృష్టిని మళ్లించే ప్రయత్నం’’ అని హఫీజుల్లా వ్యాఖ్యానించారు.
'సనాతన ధర్మం' గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య అప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ కామెంట్ ను ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు చేశారు. చెన్నైలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని' కేవలం వ్యతిరేకించలేమని, దానిని తుడిచిపెట్టేయాలని ఆయన అన్నారు. సనాతన ధర్మం ఆలోచన సహజంగానే తిరోగమనశీలమైనదని, కులం, లింగం ఆధారంగా ప్రజలను విభజిస్తుందని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయానికి సనాతన ధర్మం అనే భావన ప్రాథమికంగా వ్యతిరేకమని స్టాలిన్ వాదించారు.
తిరుపతిలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసి, కలుషితమైన నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై దేశవ్యాప్తందా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐ చీఫ్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల సిట్ ను ఏర్పాటు చేసింది.