BRS: చలో చెన్నై.. పార్టీ బలోపేతం కోసం డీఎంకే బాటలో బీఆర్ఎస్!-a team of brs senior leaders led by ktr visited chennai in september ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs: చలో చెన్నై.. పార్టీ బలోపేతం కోసం డీఎంకే బాటలో బీఆర్ఎస్!

BRS: చలో చెన్నై.. పార్టీ బలోపేతం కోసం డీఎంకే బాటలో బీఆర్ఎస్!

Basani Shiva Kumar HT Telugu
Aug 19, 2024 11:05 AM IST

BRS: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. బీఆర్ఎస్ పార్టీపై ఫోకస్ పెట్టింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకే పార్టీ గురించి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

పార్టీ బలోపేతం కోసం డీఎంకే బాటలో బీఆర్ఎస్
పార్టీ బలోపేతం కోసం డీఎంకే బాటలో బీఆర్ఎస్

పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం డీఎంకే బాటలో నడవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం.. వచ్చే నెలలో చెన్నై పర్యటించనుంది. బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పర్యటన చేయాలని గులాబీ నేతలు నిర్ణయించారు. పార్టీని మరింత పటిష్ఠం చేయడం కోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తోంది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును పరిశీలిస్తోంది.

దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న (డీఎంకే) ద్రవిడ మున్నేట్ర కజగం నిర్మాణం, పనితీరుపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. తమిళనాడుకు చెందిన డీఎంకే తరహాలోనే బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కావడంతో.. ఆ పార్టీపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే.. ఎదురైన ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనికోసం కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్లో చెన్నైలో పర్యటించనుంది.

క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు..

తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీఎంకే సంస్థాగత నిర్మాణం తోపాటు.. ఇతర అంశాలను వారం రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది. పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం.. అన్నా అరివాలయంను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో జరగబోయే పర్యటనలో కేటీఆర్ సహా.. సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం..

అధికారం కోల్పోయిన తర్వాత.. ఓటమికి గల కారణాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్.. పొరపాట్లను సరిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతోంది. రుణ మాఫీ కానీ రైతుల పక్షాన నిలుస్తోంది.

ఉత్తర తెలంగాణలో పట్టుకోసం..

బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కానీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఫలితాలు వచ్చాయి. దీంతో మళ్లీ ఆ జిల్లాలపై పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఆ జిల్లాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.