Divorce: ‘‘ఉద్యోగం మానేయాలని భార్యను బలవంతం చేయడం క్రూరత్వమే’’: ఎంపీ హైకోర్టు
Divorce: ఉద్యోగం మానేయాలని భార్యను భర్త బలవంతం చేయడం క్రూరత్వం కిందకే వస్తుందని మధ్య ప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. అనంతరం, ఉద్యోగం చేయవద్దని బలవంతం చేస్తున్న భర్త నుంచి విడాకులు కోరుతూ ఆ మహిళ పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు అనుమతించింది.
Divorce: ఉద్యోగం మానేయాలని, తనకు నచ్చినట్లుగా ఇంట్లోనే ఉండాలని బలవంతం చేయడాన్ని చట్టం క్రూరత్వంగానే పరిగణిస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం చేయవద్దంటున్న భర్త నుంచి విడాకులు కోరుతున్న ఆ మహిళ డివోర్స్ పిటిషన్ ను అనుమతించింది.
ప్రభుత్వ ఉద్యోగం..
మధ్య ప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల మహిళ కేంద్ర ప్రభుత్వ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తోంది. ఉద్యోగం మానేసి భోపాల్ లో తనతో కలిసి జీవించాలని తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కానీ, ఫ్యామిలీ కోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిలతో కూడిన మధ్యప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 13న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ, విడాకుల (divorce) కోసం మహిళ పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు అనుమతించింది.
బలవంతం చేయకూడదు
‘‘భార్యాభర్తలు కలిసి జీవించాలనుకుంటే అది వారి కోరిక. కానీ, ఉద్యోగం చేయవద్దని భర్త భార్యను, భార్య భర్తను బలవంతం చేయడం సరికాదు. ప్రస్తుత పిటిషన్ కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం మానేయాలని భార్యను భర్త బలవంతం చేశాడు. ఈ విధంగా భార్యను ఉద్యోగం మానేసి తన ఇష్టం, శైలి ప్రకారం జీవించాలని బలవంతం చేయడం క్రూరత్వం కిందకు వస్తుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇగో దెబ్బతినడంతో..
2014లో వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ భోపాల్ లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపేర్ కావడం ప్రారంభించారని ఆమె తరఫు న్యాయవాది రాఘవేంద్ర సింగ్ రఘువంశీ తెలిపారు. ‘‘2017లో నా క్లయింట్ కు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఇది అతని అహంకారాన్ని దెబ్బతీసింది. ఉద్యోగం మానేసి భోపాల్ లో తనతో కలిసి ఉండాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనకు ఉద్యోగం దొరికే వరకు ఆమె కూడా ఏ ఉద్యోగం చేయొద్దని చెప్పాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి’’ అని వివరించాడు. పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం కేసు విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.