Sex with minor wife: ‘‘మైనర్ భార్యతో శృంగారం కచ్చితంగా అత్యాచారమే; ఆమె అంగీకారంతో అయినా సరే’’- బొంబాయి హైకోర్టు-consensual sex with minor wife is also rape bombay high court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sex With Minor Wife: ‘‘మైనర్ భార్యతో శృంగారం కచ్చితంగా అత్యాచారమే; ఆమె అంగీకారంతో అయినా సరే’’- బొంబాయి హైకోర్టు

Sex with minor wife: ‘‘మైనర్ భార్యతో శృంగారం కచ్చితంగా అత్యాచారమే; ఆమె అంగీకారంతో అయినా సరే’’- బొంబాయి హైకోర్టు

Sudarshan V HT Telugu
Nov 15, 2024 02:34 PM IST

Sex with minor wife: మైనారిటీ తీరని భార్యతో, ఆమె అంగీకారంతో అయినా సరే, సెక్స్ చేయడం అత్యాచారంగానే పరిగణిస్తామని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. పరస్పర ఆమోదంతో అయినా సరే, మైనర్ భార్యతో చేసే శృంగారం రేప్ గానే పరిగణిస్తామని తెలిపింది.

మైనర్ భార్యతో శృంగారం కచ్చితంగా అత్యాచారమే
మైనర్ భార్యతో శృంగారం కచ్చితంగా అత్యాచారమే (Shutterstock/Representative)

Sex with minor wife: 18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో, ఆమె అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే కూడా అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేయవచ్చని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మైనర్ భార్యతో సెక్స్ చేయడాన్ని రేప్ గానే పరిగణిస్తామని తెలిపింది.

పొక్సొ ప్రకారం..

అత్యాచారం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (pocso) చట్టంలోని నిబంధనల కింద తనను దోషిగా నిర్ధారిస్తూ మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ట్రయల్ కోర్టు 2021 సెప్టెంబరు 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ ను జస్టిస్ గోవింద్ సనప్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. బాధితురాలు తన భార్య అని, ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతో జరిగిందని, అందువల్ల అది అత్యాచారం కిందకు రాదని ఆ వ్యక్తి వాదించాడు. కానీ, ఆ వాదనను జస్టిస్ సనప్ తోసిపుచ్చారు. 18 ఏళ్ల లోపు అమ్మాయితో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకే వస్తుందని, పెళ్లి అయినా కాకపోయినా, ఆమె ఆమోదం ఉన్నా, ఆమోదం లేకపోయినా.. అది అత్యాచారంగానే చట్టం పరిగణిస్తుందని జస్టిస్ సనప్ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం..

‘‘మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారంగానే పరిగణించాలన్న సుప్రీంకోర్టు (supreme court) నిర్దేశించిన చట్టం ప్రకారం,. పెళ్లయినా, కాకపోయినా 18 ఏళ్ల లోపు అమ్మాయితో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం అని చెప్పాలి’’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భార్య లేదా భార్యగా చెప్పబడుతున్న అమ్మాయి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు, ఆమె సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. అది అత్యాచారమేనని బాంబే హైకోర్టు (bombay high court) జస్టిస్ సనప్ తేల్చి చెప్పారు.

బాధిత బాలిక గర్భవతి కూడా..

31 వారాల గర్భవతి అయిన ఆ మైనర్ ఫిర్యాదు చేయడంతో 2019 మే 25న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. తామిద్దరం ప్రేమ వ్యవహారంలో ఉన్నామని, ఆ వ్యక్తి తనతో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనతో లైంగిక సంబంధం కొనసాగించాడని యువతి ఆరోపించింది. ఆ తర్వాత బాలిక గర్భం దాల్చి తనను పెళ్లి చేసుకోవాలని ఆ వ్యక్తిని కోరగా, అతను మరింత మోసానికి పాల్పడ్డాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి అక్కడ ఇరుగుపొరుగు వారి సమక్షంలో బాలికతో పూలదండలు మార్చుకుని, వివాహం చేసుకున్నట్లుగా ఆమెను నమ్మించాడని లైవ్ లా రిపోర్టు తెలిపింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి గర్భం తొలగించాలని బాలికపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆమె అబార్షన్ కు నిరాకరించడంతో ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా అక్కడ కూడా ఆమెపై ఓ వ్యక్తి రెండుసార్లు దాడి చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మోసపూరిత వివాహం చేసుకున్నాడని గ్రహించిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Whats_app_banner