Prajwal Revanna : అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ నిరాకరణ
Supreme Court : అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించిన పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రేవణ్ణ పిటిషన్‌ను న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
రేవణ్ణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ ఫిర్యాదులో సెక్షన్ 376 ఐపిసి(రేప్) నేరాన్ని పేర్కొనలేదని వాదించారు. ఫిర్యాదులో సెక్షన్ 376 సమస్య గురించి మాట్లాడలేదని చెప్పారు. ఆరోపణలు తీవ్రమైనవి అని అంగీకరించారు. అయితే ఫిర్యాదులో అత్యాచారానికి సంబంధించిన నిర్దిష్ట ఆరోపణ లేదని వాదించారు. అయితే అతనిపై అనేక ఇతర ఫిర్యాదులు ఉన్నాయని జస్టిస్ త్రివేది ఎత్తి చూపారు.
విదేశాల నుంచి వచ్చిన రేవణ్ణ లొంగిపోయారని బెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్ న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసు కారణంగానే రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారని, ఆరు నెలల తర్వాత బెయిల్ కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించినట్లు రోహత్గీ కోర్టుకు తెలిపారు. బెంచ్ అతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. అతనిపై అనేక కేసులు ఉన్నాయని పేర్కొంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మరో 6 నెలల తర్వాత దరఖాస్తు చేయవచ్చా? అని రోహత్గీ అభ్యర్థించారు. దీనిపై జస్టిస్ త్రివేది స్పందిస్తూ 'మేం ఏమీ చెప్పడం లేదు' అని వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 21న రేవణ్ణ రెగ్యులర్ బెయిల్, ముందస్తు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న బెయిల్ పిటిషన్లపై తరఫు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రేవణ్ణపై IPC సెక్షన్లు 376(2)n (ఒకే మహిళపై పదే పదే అత్యాచారం చేయడం, 376(2)k(ఒక మహిళపై నియంత్రణ లేదా ఆధిపత్యంలో ఉన్నప్పుడు అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపు) సహా పలు నేరాలకు సంబంధించి అభియోగాలు మోపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 354(ఎ) (లైంగిక వేధింపులు)లాంటి ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు ఉన్నాయి.