Shah Rukh Khan : షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్.. నా ఫోన్ పోయిందని చెప్పిన న్యాయవాది అరెస్ట్
Shah Rukh Khan Threat Call : ఇటీవల సెలబ్రెటీలకు బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్‌కు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. మరోవైపు షారుఖ్ ఖాన్‌కు కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్, డబ్బులు డిమాండ్ చేయడం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్‌కు కూడా ఇలాంటి బెరిదింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో న్యాయవాదిగా గుర్తించారు. నటుడు షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
గత వారం షారుఖ్ ఖాన్‌ను బెదిరింపు కాల్ వచ్చింది. రూ.50 లక్షలు అడిగారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కాలర్‌పై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్‌లు 308(4) (చంపడం లేదా తీవ్రంగా గాయపరచడం వంటి బెదిరింపులతో కూడిన దోపిడీ), 351(3)(4) (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కాల్ ఎవరి నుంచి వచ్చిందని ఆరా తీయగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఫైజాన్‌ఖాన్ అనే న్యాయవాది గురించి తెలిసింది. లాయర్ పేరు మీద రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌ను ఉపయోగించి బెదిరింపు కాల్ చేసినందుకు అతన్ని పిలిచారు. పోలీసుల ఎదుట హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు రాయ్‌పూర్‌ని సందర్శించి పాండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఫైజన్ ఖాన్‌ను పిలిపించారు.
అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ కాల్ తాను చేసినట్టుగా ఫైజాన్‌ఖాన్ ఒప్పుకోలేదు. షారుఖ్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు కాల్ గురించి ఫైజాన్ మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ పోగొట్టుకున్నాడని, ఖమర్దిహ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ నంబర్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్ తనపై కుట్రలో భాగమేనని ఫైజాన్ మీడియాకు తెలిపారు.
'నవంబర్ 2న నా ఫోన్ దొంగిలించారు. నేను ఫిర్యాదు చేశాను. దాని గురించి ముంబై పోలీసులకు చెప్పాను. వారు నన్ను సుమారు రెండు గంటల పాటు విచారించారు.' అని అతను మీడియాతో చెప్పాడు.
అయితే జింకలను వేటాడేందుకు సంబంధించి 'అంజామ్' (1994) సినిమాలోని డైలాగ్‌పై షారూఖ్ ఖాన్‌పై ఫిర్యాదు చేసినట్లు ఫైజాన్ తెలిపారు. 'నేను రాజస్థాన్‌కు చెందినవాడిని. బిష్ణోయ్ కమ్యూనిటీలో నా స్నేహితులు ఉన్నారు. జింకలను రక్షించడం వారి సంస్కృతిలో ఉంది. ఒక ముస్లిం జింక గురించి ఇలా చెబితే అది సరైనది కాదు. అందుకే అభ్యంతరం చెప్పాను.' అని ఫైజాన్ అన్నారు.
అయితే తన ఫోన్ నుండి ఎవరు కాల్ చేసినా అది ఉద్దేశపూర్వకంగానే అనిపిస్తుందని వెల్లడించారు. ఇది తనపై కుట్ర అని ఫైజాన్ చెప్పుకొచ్చారు.
ఇటీవల సెలబ్రెటీలుక బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌కు నేరుగానే వచ్చాయి. దీంతో అతడు సెక్యూరిటీ పెంచుకోవాల్సి వచ్చింది. తాజాగా షారుఖ్ ఖాన్‌కు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి.