AAP MLA joins BJP: బీజేపీలో చేరిన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే; ఎన్నికల ముందు వలసల పర్వం ప్రారంభమైందా?-delhi aap mla kartar singh tanwar former minister raj kumar anand join bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aap Mla Joins Bjp: బీజేపీలో చేరిన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే; ఎన్నికల ముందు వలసల పర్వం ప్రారంభమైందా?

AAP MLA joins BJP: బీజేపీలో చేరిన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే; ఎన్నికల ముందు వలసల పర్వం ప్రారంభమైందా?

HT Telugu Desk HT Telugu
Jul 10, 2024 04:23 PM IST

AAP MLA joins BJP: కీలక నేతల అరెస్ట్ ల నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఆప్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీలో చేరిన ఆప్ నేతలతో బీజేపీ ఢిల్లీ నాయకులు
బీజేపీలో చేరిన ఆప్ నేతలతో బీజేపీ ఢిల్లీ నాయకులు

AAP MLA joins BJP: ఢిల్లీలోని ఛత్తర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి, పటేల్ నగర్ మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్, మరో మాజీ పటేల్ నగర్ ఎమ్మెల్యే వీణా ఆనంద్ బుధవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఢిల్లీలోని కౌన్సిలర్లు కూడా..

దక్షిణ ఢిల్లీలోని సయ్యద్-ఉల్-అజైబ్ వార్డుకు చెందిన ఆప్ కౌన్సిలర్ ఉమేద్ సింగ్ ఫోగట్, మరో ఇద్దరు ఆప్ సభ్యులు కూడా ఈ సందర్భంగా కాషాయ పార్టీలో చేరారని, వారికి స్వాగతం పలికేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా హాజరయ్యారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ తెలిపారు.

ఆప్ లో అవినీతి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, పనితీరుతో స్ఫూర్తి పొంది ఆప్ నేతలు బీజేపీలో చేరుతున్నారని, ఆప్ లో పనిచేయడం నియంతృత్వం కింద పనిచేయడం లాంటిదని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ వ్యాఖ్యానించారు. ఆప్ లో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. 2015లో ఛతర్పూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కర్తార్ సింగ్ తన్వర్ 2020లో మళ్లీ ఆప్ నుంచి పోటీ చేశారు. 2014లో ఆప్ లో చేరకముందు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన తిరిగి పార్టీలో చేరడాన్ని బీజేపీ నేతలు 'హోమ్ కమింగ్ 'గా అభివర్ణించారు.

మాజీ మంత్రి కూడా..

రాజ్ కుమార్ ఆనంద్ 2020 లో ఆప్ టికెట్ పై రిజర్వ్డ్ సీటు అయిన పటేల్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం, ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మంత్రి అయ్యారు. పార్టీ అవినీతికి పాల్పడుతోందని, దళితులను విస్మరిస్తోందని ఆరోపిస్తూ ఏప్రిల్ 10న హఠాత్తుగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒక నెల తరువాత, మే 5వ తేదీన బీఎస్పీ లో చేరారు. 2024 లోక్ సభ ఎన్నికలలో న్యూఢిల్లీ స్థానం నుండి బీఎస్పీ తరఫున పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జూన్ 14న అసెంబ్లీ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. రాజ్ కుమార్ ఆనంద్ భార్య వీణా ఆనంద్ 2013లో పటేల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో చురుకైన ఆప్ నాయకురాలిగా ఉన్నారు.

2025 అసెంబ్లీ ఎన్నికల ముందు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు 2025 జనవరి-ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. అంటే ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే ఉన్న సమయంలో, పార్టీ నేతలు బీజేపీ లో చేరడం ఆప్ కు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు అవినీతి ఆరోపణల కేసుల్లో జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఆప్ ఇంకా స్పందించలేదు. ఢిల్లీ అసెంబ్లీలో బిజెపికి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు.

Whats_app_banner