RS Praveen Kumar : బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా, నాకు వేరే మార్గంలేదంటూ ట్వీట్
RS Praveen Kumar : బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని ఆయన ప్రకటించారు.
RS Praveen Kumar : బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఇటీవల బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తులపై బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పొత్తు వెనక్కి తీసుకోవాలని మాయావతిపై ఒత్తిడి తెస్తుందన్నారు. హైదరాబాద్ నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. త్వరలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
నాకు వేరే మార్గంలేదు
"ప్రియమైన బహుజనులారా, నేను ఈ మెసేజ్‌ని టైప్ చేయలేకపోతున్నాను, అయితే ఇప్పుడు కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున నేను దీన్ని తప్పక చేయాలి. దయచేసి ఈ పోస్ట్ పెడుతున్నాను. నన్ను క్షమించండి.నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్(BSP) పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవలి నిర్ణయాల వల్ల, పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. అదే సమయంలో నేను కొన్ని ప్రధాన సూత్రాలు, వ్యక్తిగత పాత్రపై రాజీ పడకూడదనుకుంటున్నాను. నేను ఎవరినీ నిందించను. నన్ను నమ్మిన వారిని మోసం చేయను. తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాల్సింది బహుజన సమాజ్ పార్టీ" -ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నా మార్గంలో నిర్భయంగా ప్రయాణిస్తా
"బీఎస్పీ అధినేత్ర మాయామతికి(Mayawati) నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను విశ్వసించినందుకు, నన్ను నడిపించినందుకు. మీరు ఎప్పటికీ నా హీరో. సామాజిక న్యాయం కోసం మాన్యవర్ కాన్షీరామ్ స్థాపించిన ఈ మిషన్‌ను నా జీవితాంతం నా మనస్సులో ఎల్లప్పుడూ ఉంచుకుంటాను. బహుజన రాజకీయ ప్రపంచంలో ఈ చిన్న ప్రయాణానికి అవకాశం కల్పించిన రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్ కు ధన్యవాదాలు. నాపై విశ్వాసం ఉంచినందుకు ఈ దేశంలోని బహుజనులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పవిత్రమైన రాజ్యాంగ విలువలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోనని, బహుజనులను నీతిమంతులుగా, స్వావలంబనతో, ముందుకు చూసేవారిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. నా సొంత మార్గంలో నిర్భయంగా ప్రయాణిస్తాను. ఇది నా జీవితకాల మిషన్ అవుతుంది. నాకు అండగా నిలిచినందుకు తెలంగాణ, భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు" అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ట్వీట్ చేశారు.
పొత్తును భగ్నం చేసేందుకు బీజేపీ కుట్ర
చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెలో పదిలంగా దాచుకుంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తెలిపారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందేన్నారు. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే అన్నారు. ఇదే తాను నమ్మిన నిజమైన ధర్మం అన్నారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పొత్తు(BSP BRS Alliance) వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ(BJP) ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే కవిత అరెస్టు జరిగిందన్నారు. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనన్నారు. నా ప్రస్థానాన్ని ఆపలేనంటూ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం