Cyclone Remal update: రేపే రెమల్ తుపాను తీరం దాటే అవకాశం; ఒడిశా, పశ్చిమబెంగాలలో భారీ వర్షాలు-cyclone remal update west bengal odisha brace for impact check landfall time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Remal Update: రేపే రెమల్ తుపాను తీరం దాటే అవకాశం; ఒడిశా, పశ్చిమబెంగాలలో భారీ వర్షాలు

Cyclone Remal update: రేపే రెమల్ తుపాను తీరం దాటే అవకాశం; ఒడిశా, పశ్చిమబెంగాలలో భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu
May 25, 2024 05:10 PM IST

Cyclone Remal update: మే 26, ఆదివారం రోజు రెమల్ తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను కారణంగా ఒడిశా, పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెమల్ తుపాను ముప్పు నేపథ్యంలో ఆ తుపాను ప్రభావం పడే రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

రేపు రాత్రి తీరం దాటనున్న రెమల్ తుపాను
రేపు రాత్రి తీరం దాటనున్న రెమల్ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆ తుపానుకు రెమల్ తుపాను అని పేరు పెట్టారు. ఈ రెమల్ తుపాను వల్ల బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్ లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

120 కిమీ వేగంతో గాలులు..

రెమల్ తుపాను మే 25 సాయంత్రానికి తుపానుగా మారి, మే 26, ఆదివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే నెల 26,27 తేదీల్లో పశ్చిమబెంగాల్, ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మే 27, 28 తేదీల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

2 మీటర్ల ఎత్తుకు అలలు

రెమల్ తుపాను మే 26, ఆదివారం రాత్రి తీరం దాటే సమయానికి సముద్రంలో అలలు 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు, బంగ్లాదేశ్ లోని లోతట్టు ప్రాంతాలను ఇవి ముంచెత్తుతాయని తెలిపింది. రెమల్ తుపాను కారణంగా బంగాళాఖాతం తీరంలో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు మే 27 ఉదయం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలైన దక్షిణ, ఉత్తర 24 పరగణాలకు మే 26, 27 తేదీల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోల్కతా, హౌరా, నదియా, పుర్బా మేదినీపూర్ జిల్లాలకు మే 26, 27 తేదీల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాలైన బాలాసోర్, భద్రక్, కేంద్రపారాలో మే 26,27 తేదీల్లో భారీ వర్షాలు, మే 27న మయూర్ భంజ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరానికి సమీపంలో నివసించే వారు వాతావరణ సూచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, మే 27 వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ నెల 26, 27 తేదీల్లో స్థానికంగా వరదలు వచ్చి విద్యుత్ లైన్లు, పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి మెయిన్ ఎలక్ట్రికల్ స్విచ్ ఆఫ్ చేసేలా చూసుకోవాలి.
  • నివసిస్తున్న ఇల్లు సురక్షితంగా లేకపోతే, కూలిపోయే ప్రమాదం ఉన్నట్లయితే, సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి.
  • బలమైన గాలుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తలుపులు మరియు కిటికీలను వీలైనంత గట్టిగా మూసివేయాలి.
  • ప్రభుత్వం నుంచి వచ్చే తరలింపు నోటీసులు, తాజా వాతావరణ సూచనలు, భద్రతా సూచనలు, ఆరోగ్య సలహాలను పాటించాలి.
  • పడిపోయే ప్రమాదం ఉన్న భవనాల కింద ఆశ్రయం పొందకూడదు.

టీ20 వరల్డ్ కప్ 2024