Michaung Cyclone : బాపట్ల తీరాన్ని తాకిన తీవ్ర తుపాను, మరో గంటలో తీరం దాటే అవకాశం!
Michaung Cyclone : ఏపీలో బీభత్సం సృష్టిస్తోన్న మిచౌంగ్ తుపాను బాపట్ల తీరాన్ని తాకింది. మరో గంటలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Michaung Cyclone : మిచౌంగ్ తుపాను ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల ధాటికి వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలవ్వడంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. అతి తీవ్ర తుపాను మిచౌంగ్ బాపట్ల తీరాన్ని తాకింది. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మరో గంటలో తుపాను పూర్తిగా తీరం దాటనుందన్నారు. తీరం దాటాక మంగళవారం సాయంత్రానికి తుపాను బలహీనపడి వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో తీరంలో 90-100 కిమీ వేగంలో గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు 2 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
మరో 24 గంటలు భారీ వర్షాలు
తుపాను తీరం దాటి భూభాగంపైకి వచ్చాక క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావంతో మరో 24 గంటలపాటు రాష్ట్రం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తుపాను కారణంగా బాపట్ల, నిజాంపట్నం, మచిలీపట్నంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. కాకినాడలో 9, విశాఖ, కళింగపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో సైతం వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వేల ఎకరాల్లో పంటనష్టం
మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. తిరుపతి జిల్లాలోని చిట్టేడులో అత్యధికంగా 39 సెం.మీల వర్షపాతం రికార్డైంది. చిల్లకూరులో 33 సెం.మీ, నాయుడుపేట 28.7 సెం.మీ, ఎడ్గలి 24 సెం.మీ, బాపట్ల 21 సెం.మీ, మచిలీపట్నం 14.9 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 10 సెం.మీల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డు అయింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల దాటికి వరి చేలు నేలమట్టం అయ్యాయి. వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.