heatwave: ఏపీలోని రాయలసీమతో పాటు ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
heatwave alert: వేసవి క్రమంగా తీవ్రమవుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వడగాల్పుల ముప్పు ముంచుకువస్తోంది. ఏపీలోని రాయలసీమతో పాటు పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారి చేసింది. ఆ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పుల ముప్పు ఉందని, మధ్నాహ్నం అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
రానున్న రెండు రోజుల పాటు తూర్పు, దక్షిణ భారత దేశంలో వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అలాగే, ఈశాన్య ప్రాంతంలో ఏప్రిల్ 9 వరకు వర్షాలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో, ముఖ్యంగా ఏప్రిల్ మరియు జూన్ మధ్య దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ రాష్ట్రాల్లో హీట్ వేవ్
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 5 నుంచి 9 వరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆదివారం వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండి, వేడిగాలులు వీస్తున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం ఉండడం ప్రాణాంతకం. వేసవిలో వేడికి గురికాకుండా ఉండాలంటే తేలికపాటి, లేత రంగులో ఉన్న, వదులుగా ఉన్న, కాటన్ దుస్తులు ధరించాలని, తలను కవర్ చేయాలని, అందుకు గుడ్డ, టోపీ లేదా గొడుగును ఉపయోగించాలని ఐఎండీ ప్రజలకు సూచించింది.
బంగ్లాదేశ్ లో వాయుగుండం
ఇదిలావుండగా, ఉత్తర బంగ్లాదేశ్ లో వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తూర్పు అస్సాం, పరిసర ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి/మోస్తరు వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉంది. వచ్చే ఏడు రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్లు) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, ఏప్రిల్ 10,11 తేదీల్లో రాజస్థాన్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో సాధారణ వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత
మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 40 నుంచి 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సీజనల్ సగటును మించిపోయాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలులు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.