TS Weather Updates : తెలంగాణకు ఐఎండీ కూల్ న్యూస్ - ఆ 3 రోజులు వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్..!
Telangana AP Weather Updates : మండుతున్న ఈ వేసవిలో తెలంగాణకు చల్లని కబురు చెప్పింది ఐఎండీ. ఏప్రిల్ 7,8 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Telangana AP Latest Weather Updates :భానుడి ఉగ్రరూపంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి చివరి మాసం నుంచే ఎండల తీవ్రత ఉండగా... ఏప్రిల్ ఎంట్రీ కావటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అత్యవసర పనులు అయితే తప్పా... మధ్యాహ్నం సమయంలో అసలు బయటికి వెళ్లవద్దని సూచిస్తున్నాయి. మరోవైపు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఫలితంగా వడదెబ్బ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.... తెలంగాణకు చల్లని కబురును(Telangana Weather ) మోసుకొచ్చింది వాతావరణశాఖ. ఓవైపు మండుతున్న వేసవితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా... తాత్కాలిక ఉపశమనం కలిగించేలా కూల్ న్యూస్ చెప్పింది. ఈ ఏప్రిల్ 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ మేరకు తాజా బులెటిన్ ను విడుదల చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Centre Hyderabad) తాజా బులెటిన్ ప్రకారం... ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (IMD Rain Alert)అక్కడకక్కడ కురిసే(Rains in Telangana) అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఏప్రిల్ 8వ తేదీన పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. గాలి వేగం గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 08.30 గంటల లోపు పలు ప్రాంతాల్లో కూాడా వర్షాలు పడొచ్చని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్ల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 10వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో వివరించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. మార్చిలో మధ్య వాతావరణం సాధారణ స్థితికి చేరినా చివరి వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు (temparature )కొనసాగాయి. ఏప్రిల్ నాటికి అవి మరింత పెరిగాయి.
పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు రాత్రి పూట ఉక్కపోత ప్రజల్ని వేధిస్తోంది. ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది. గత ఏడాది కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే హెచ్చరికలతో జనం బెంబెలెత్తి పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలతో హెచ్చుతగ్గులు కూడా అధికంగా నమోదైనట్లు అమెరికన్ వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏపీ, తెలంగాణల్లో వాతావరణాల్లో వస్తున్న మార్పులను విశ్లేషించారు.
1970 జనవరి 1 నుంచి 2023 జూన్ 30వరకు 53ఏళ్ల పాటు దేశంలో ఉష్ణోగ్రతలలో వచ్చిన మార్పులను అత్యాధునికి పద్ధతుల్లో విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యాభై ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 0.5డిగ్రీలు పెరిగింది. ఏపీలో 0.9డిగ్రీలు పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 15వ స్థానంలో తెలంగాణ 28వస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.