APTS Weather Updates: మన్యంలో వడ గాల్పులు.. తెలంగాణ భగభగలు.. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
APTS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.
APTS Weather Updates: ఏపీ, తెలంగాణ Telanganaల్లో ఉక్కపోత, వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు. పగలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏప్రిల్ నెల మొదట్లోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. మార్చిలో మధ్య వాతావరణం సాధారణ స్థితికి చేరినా చివరి వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు temparature కొనసాగాయి. ఏప్రిల్ నాటికి అవి మరింత పెరిగాయి.
తెలంగాణలో రెండు జిల్లాల్లో తప్ప అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటింది.
నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు రాత్రి పూట ఉక్కపోత ప్రజల్ని వేధిస్తోంది. ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది. గత ఏడాది కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే హెచ్చరికలతో జనం బెంబెలెత్తి పోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలతో హెచ్చుతగ్గులు కూడా అధికంగా నమోదైనట్లు అమెరికన్ వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏపీ, తెలంగాణల్లో వాతావరణాల్లో వస్తున్న మార్పులను విశ్లేషించారు.
1970 జనవరి 1 నుంచి 2023 జూన్ 30వరకు 53ఏళ్ల పాటు దేశంలో ఉష్ణోగ్రతలలో వచ్చిన మార్పులను అత్యాధునికి పద్ధతుల్లో విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
యాభై ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 0.5డిగ్రీలు పెరిగింది. ఏపీలో 0.9డిగ్రీలు పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 15వ స్థానంలో తెలంగాణ 28వస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
నేడు మన్యంలో వడగాల్పులు…
నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే 130 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
వడగాల్పులు వీచే మండలాలు(130) :-
శ్రీకాకుళం 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4,అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
బుధవారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో43.4°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.