CBSE Board Exams : సీబీఎస్ఈ క్లాస్ 10, 12 పరీక్షలు రాయాలంటే అటెండెన్స్ ఎంత ఉండాలి?
CBSE Board Exams 2025 : సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షకు హాజరవ్వాలంటే కనీస అటెండెన్స్ క్రైటీరియా ఏంటి? ఈ విషయంపై సీబీఎస్ఈ తాజాగా ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అలర్ట్! ఎగ్జామ్ రాసేందుకు అటెండెన్స్ ఎలిజిబులిటీని సీబీఎస్ఈ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుబంధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు / అధిపతులకు జారీ చేసిన అధికారిక నోటీసులు ఇచ్చింది.
బోర్డు నిబంధనల ప్రకారం, బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి విద్యార్థులు కనీసం 75% హాజరు తప్పనిసరి. అనుబంధ పాఠశాలలు పదవ తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థుల అటెండెన్స్‌కి సంబంధించి సీబీఎస్ఈ పరీక్ష ఉప నిబంధనలలోని రూల్స్ 13,14 ని ఖచ్చితంగా పాటించాలని గుర్తు చేసింది.
"మెడికల్ ఎమర్జెన్సీలు, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాల్గొనడం, ఇతర తీవ్రమైన కారణాల వల్ల అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే మాత్రమే బోర్డు 25% సడలింపు ఇస్తుంది," అని సీబీఎస్ఈ నోటీసులో తెలిపింది.
"పాఠశాలలు కేవలం అకడమిక్ లెర్నింగ్ సెంటర్లు మాత్రమే కాదని, విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అందరికీ తెలిసిందే. సబ్జెక్టు పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, పాఠశాలలు పాఠ్యేతర కార్యకలాపాలు, తోటివారి అభ్యాసం, వ్యక్తిత్వ నిర్మాణం, విలువలను పెంపొందించడం, టీమ్ వర్క్, సహకారం, వైవిధ్యాన్ని గౌరవించడంతో పాటు మరెన్నో విషయాలను సులభతరం చేస్తాయి. అందువల్ల, వారి సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాలలో విద్యార్థుల క్రమం తప్పకుండా హాజరు కావడం చాలా ముఖ్యం," అని నోటీసులో సీబీఎస్ఈ పేర్కొంది.
హాజరు ఆవశ్యకత, క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షల కోసం అటెండెన్స్ రూల్స్ పాటించకపోతే దాని పర్యవసానాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని పాఠశాలలను సీబీఎస్ఈ ఆదేశించింది. సీబీఎస్ఈ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో సరైన సెలవు రికార్డులు లేకుండా విద్యార్థులు గైర్హాజరయ్యారని గమనించినట్లయితే, వారు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావడం లేదని తెలిస్తే, సీబీఎస్ఈ వారిని బోర్డు పరీక్షలకు హాజరు కానివ్వదని స్పష్టం చేసింది.
పాఠశాల హాజరు కొరత కేసులను సీబీఎస్ఈకి సమర్పించిన తర్వాత అటెండెన్స్ రికార్డుల్లో ఎలాంటి మార్పులకు అనుమతించబోమని, విద్యాసంవత్సరం జనవరి 1 నాటికి హాజరును లెక్కిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలతో పాటు, హాజరు కొరతను క్షమించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ), రిక్వెస్ట్ కోసం కేసులను సమర్పించేటప్పుడు ఉపయోగించాల్సిన ప్రోఫార్మాను కూడా బోర్డు లిస్ట్ చేసింది.
స్కూల్స్‌లో సీసీటీవీ కెమెరాలు..!
బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరగకుండా సీబీఎస్ఈ కఠిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు ఇటీవలే కొత్త ఆదేశాలు ఇచ్చింది. పరీక్షా కేంద్రాలుగా మారే అన్ని స్కూల్స్‌లో సీసీటీవీ మానిటరింగ్ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సన్యం భరద్వాజ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సీసీటీవీ పర్యవేక్షణ లేని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించబోమని భరద్వాజ్ తేల్చిచెప్పారు. అన్ని ఎగ్జామ్ సెంటర్స్‌లో సీసీటీవీ కెమెరాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం