Thursday Motivation: కష్టం వచ్చినప్పుడు మీలోని ధైర్యాన్ని తట్టి లేపాలి, అదే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
Thursday Motivation: కష్టం వచ్చినప్పుడు చాలామంది కుంగిపోతారు. జీవితంపై విరక్తిని పెంచుకుంటారు. నిజానికి కష్టం వచ్చినప్పుడే మీలోన ధైర్యాన్ని తట్టి లేపాలి, అదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
అడవిలో చెట్లపై కోతులన్నీ గుంపులుగా ఆడుకుంటున్నాయి. చెట్ల కింద ఒక పాము పాకుతూ ఆ కోతులకు కనిపించింది. ఆ పాము చాలా వేగంగా పాకడం మొదలుపెట్టింది. వాటిని కోతులు చూసాయి. ఒక కోతి అనుకోకుండా ఆ పాము దగ్గరికి వెళ్ళింది. పాము కోతిని కాటు వేయబోతే... అది వెంటనే ఆ పాము పడగను పిడికిలితో పట్టేసింది.
తనను కాటు వేయకుండా కోతిని పాము పడగను పట్టగలిగింది కానీ మనసులో భయంతో వణికిపోయింది. మిగతా కోతులను చూడ సాగింది. అవి తనను రక్షించడానికి వస్తాయని ఎంతో అరిచింది. కానీ మిగతా కోతులు మాత్రం పాము నుంచి ఆ కోతిని విడిపించేందుకు ప్రయత్నించలేదు. ఎందుకంటే కోతి పాము పడగను వదిలేస్తే ఆ పాము వెంటనే కాటేస్తుంది. తాము దగ్గరకు వెళితే తమను కూడా కాటు వేయవచ్చు. అందుకే తమకెందుకులే అని వదిలేసాయి. దీంతో ఆ కోతికి పరిస్థితి అర్థం అయింది.
తాను ధైర్యంగా వ్యవహరిస్తేనే తన ప్రాణాలతో బతుకుతానని అర్థమైంది. మనసులోనే ధైర్యాన్ని నింపుకుంది. తాను ఎలాగైనా పాము నుంచి బతికి బయటపడాలని నిర్ణయించుకుంది. చేతులను అలా గట్టిగా బిగించి పామును మరింత గట్టిగా నొక్కేసింది. ఈ లోపు అటువైపు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ కోతిని చూసి ‘నువ్వెప్పుడో ఆ పాము మెడను నొక్కి చంపేసావు. ఇప్పుడు దాన్ని నువ్వు వదిలేసినా కూడా నీ ప్రాణానికి ఎలాంటి అపాయము లేదు’ అని చెప్పాడు. దీంతో నిజంగానే కోతి తన పిడికిలిని వదిలిపెట్టేసింది. పాము నిర్జీవంగా కింద పడిపోయింది. కోతి ప్రాణాలతో బయటపడి తన గుంపులో కలిసిపోయింది.
ఈ కోతి కథను బట్టి పరిస్థితి చేయి జారినప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి తప్ప పిరికితనంతో ప్రాణాలు పోగొట్టుకోకూడదు అని అర్థం చేసుకోవాలి. ఇదే కాదు ఎప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారిన ధైర్యంగా అడుగు ముందుకేస్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు ఏదైనా చేయగలరని నమ్మకం పెరుగుతుంది. ఒక మనిషికి ధైర్యం, ఆత్మ విశ్వాసం చాలా ముఖ్యమైనవి. ఈ రెండూ మీ దగ్గర ఉంటే జీవితంలో మీకు ఎప్పుడూ కష్టాలు ఎదురు కావు, మీరుప్రతి కష్టం నుంచి బయటపడగలరు.