World Arthritis Day 2023: భుజం నొప్పి లక్షణాలు, చికిత్స, ని నివారించడానికి చిట్కాలు
World Arthritis Day 2023: ఈరోజు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం. ఈ సందర్భంగా భుజం నొప్పి లక్షణాలు, చికిత్స, నివారణ చిట్కాలను వైద్య నిపుణులు వివరించారు.
అన్ని వయస్సుల వ్యక్తులు భుజం నొప్పితో బాధపడుతుంటారు. ఇది వారి జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. ఇందుకు గల కారకాలు, సంకేతాలు, రోగ నిర్ధారణ, చికిత్స వంటి వివరాలు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. భుజం నొప్పి ఒక వ్యక్తి జీవన నాణ్యతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. వస్తువులను ఎత్తడం వంటి రోజువారీ కార్యకలాపాలను, దుస్తులు ధరించడం వంటి సాధారణ పనులను కూడా చేయగల సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది.
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, భుజం శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చింతన్ దేశాయ్ దీనిపై సవివరంగా చర్చించారు. ‘భుజం నొప్పి స్థిరంగా లేదా అప్పడప్పుడూ ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సవాలుగా ఉంటుంది. ఫలితంగా, వ్యక్తులు ఒంటరితనం, నిరాశ భావాలను ఎదుర్కొంటారు. ఇంకా భుజం నొప్పి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. పగటిపూట అలసటను పెంచుతుంది. ఉత్పాదకతను తగ్గిస్తుంది..’ అని వివరించారు.
భుజం నొప్పికి కారణాలు:
‘ప్రమాదాలు లేదా ఇంట్లో జారి పడడం వంటి వాటి ఫలితంగా భుజంలో పగుళ్లు, లిగమెంట్లలో గాయాలు సంభవించవచ్చు. దీని వలన తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఎక్కువగా కదలలేరు. ఈ బాధాకరమైన సందర్భాలలో భుజం స్థిరత్వం, పనితీరును పునరుద్ధరించడానికి తక్షణ వైద్య సంరక్షణ, పునరావాసం అవసరం కావచ్చు. రొటేటర్ కఫ్ టెండినిటిస్ వంటి ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్‌లు స్పోర్ట్స్ లేదా కొన్ని ఉద్యోగాల్లో పునరావృతమయ్యే ఓవర్‌హెడ్ కదలికల వల్ల కూడా ఉత్పన్నమవుతాయి. ఇది భుజంలో మంట, నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్థితి వల్ల వస్తువులను చేరుకోవడం లేదా ఎత్తడం ఇబ్బందికరంగా ఉంటుంది..’ అని ఆమె వివరించారు.
‘కండరాలు చిట్లడం, లిగమెంట్లు దెబ్బతినడానికి కారణం భుజం ఎక్కువగా వాడాల్సి రావడం లేదా క్రీడల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం కారణమై ఉండొచ్చు. ఫలితంగా తీవ్రమైన నొప్పి, బలహీనత ఏర్పడుతుంది. భుజం ఫ్రీజ్ అయిపోతుంది. భుజం కీలులో దృఢత్వం ఏర్పడుతుంది. కదిలించడానికి కష్టమవుతుంది. ఈ పరిస్థితి వస్తువులను చేరుకోవడం లేదా జుట్టు దువ్వడం వంటి సాధారణ కదలికలను కష్టతరం చేస్తుంది..’ అని వివరించారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రెండూ భుజం కీలుపై ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా వృద్ధులలో నిరంతర నొప్పి, దృఢత్వాన్ని కలిగిస్తాయని డాక్టర్ చింతన్ దేశాయ్ వివరించారు. ‘భుజం కీళ్ళనొప్పులను ఎదుర్కోవడంలో నొప్పి నిర్వహణ పద్ధతులు, వ్యాయామాలు తోడ్పడుతాయి..’ అని వివరించారు.
భుజం నొప్పి యొక్క లక్షణాలు:
కదలిక భరించలేనదిగా మారడం, సూదులతో గుచ్చినట్టు అనిపించడం, కీళ్ల నొప్పి, క్యాచింగ్ సెన్సేషన్ భుజం నొప్పిని సూచిస్తాయి.
భుజం నొప్పికి చికిత్స:
‘మందులు, నొప్పి నిర్వహణ పద్ధతులు భుజం నొప్పిని సమర్థవంతంగా తగ్గించగలవు. ఫిజియోథెరపీ, హాట్ అండ్ కోల్డ్ థెరపీ, భుజాన్ని బలోపేతం చేయడం, కదలికలను మెరుగుపరచడం రికవరీ ప్రక్రియలో సహాయపడుతుంది. కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు నొప్పి యొక్క నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి, వాపును తగ్గించడానికి కూడా సిఫారసు చేస్తారు. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ లేదా భుజం కీళ్ల మార్పిడి కూడా కొంతమంది రోగులకు తగిన చికిత్సగా ఉంటుంది..’ అని డాక్టర్ చింతన్ దేశాయ్ సూచించారు.
భుజం నొప్పిని నివారించడానికి చిట్కాలు:
‘మీ భుజాల స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి భుజాన్ని బలపరిచే వ్యాయామాలు చేయాలి. సరైన భంగిమ ఉండేలా చూసుకోవాలి. మీ భుజాలపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ భుజాలకు గాయాలు కాకుండా ఉండటానికి వాటిని ఎక్కువగా ఉపయోగించవద్దు. పునరావృత కదలికలను పరిమితం చేయాలి. శారీరకంగా శ్రమించాల్సి వస్తే భుజం గాయాలు అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి వార్మప్‌లు చేయండి..’ అని డాక్టర్ చింతన్ దేశాయ్ సూచించారు.