Sago Dosa Recipe: సగ్గుబియ్యం దోశ గుండెకు బలం.. ఇలా చేస్తే బియ్యం దోశ కన్నా చాలా మేలు-why sago dosa is a better choice for your heart than rice dosa ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sago Dosa Recipe: సగ్గుబియ్యం దోశ గుండెకు బలం.. ఇలా చేస్తే బియ్యం దోశ కన్నా చాలా మేలు

Sago Dosa Recipe: సగ్గుబియ్యం దోశ గుండెకు బలం.. ఇలా చేస్తే బియ్యం దోశ కన్నా చాలా మేలు

HT Telugu Desk HT Telugu
Oct 31, 2023 07:05 PM IST

సగ్గు బియ్యంతో చేసిన దోశెలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. ఇది గ్లూటెన్ రహిత పదార్థం. గోధుమలు పడని వారికి సగ్గుమియ్యం మంచి ఎంపిక.

సగ్గుబియ్యంతో చేసిన దోశలు చాలా ఆరోగ్యకరమైన ఆహారం
సగ్గుబియ్యంతో చేసిన దోశలు చాలా ఆరోగ్యకరమైన ఆహారం

గుండెకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని ప్రత్యేకంగా తినాల్సిన రోజులు ఇవి. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

తెలుగిళ్లల్లో అందరికీ ఇష్టమైన అల్పాహారం దోశలు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మసాలా దోశ, రవ్వదోశ, కారం దోశ, చీజ్ దోశె... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన దొరికే బ్రేక్ ఫాస్ట్ దోశలు. బియ్యం, మినపప్పులను నానబెట్టి దోశెలను వండుతారు. అందరికీ ఈ పద్ధతిలోనే దోశలు చేసుకోవడం అలవాటు. ఈ కాలంలో తినే తిండిని ప్రత్యేకంగా పర్యవేక్షించుకోవల్సిన అవసరం ఉంది. బరువును పెంచకుండా, శరీరానికి శక్తిని అందించే ఆహారాన్ని తినడం చాలా అవసరం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు కలుగుతున్నాయి. ఇరవై ఏళ్ల వారికి కూడా గుండె పోటు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా అవసరం. ఎప్పుడూ చేసుకునేలా బియ్యంతో చేసిన దోశెలు తినేకన్నా అప్పుడప్పుడు సగ్గుబియ్యం దోశెలు తినడానికి ప్రయత్నించండి.

సగ్గు బియ్యంతో చేసిన దోశెలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. ఇది గ్లూటెన్ రహిత పదార్థం. గోధుమలు పడని వారికి సగ్గుమియ్యం మంచి ఎంపిక. గ్లూటెన్ అలెర్టీ ఉన్న వారు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తినడం మంచిది. సగ్గుబియ్యాన్ని సాబుదానా అంటారు. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. సగ్గుబియ్యంతో చేసిన దోశెలు తినడం వల్ల శక్తి స్థిరంగా విడుదలవుతూ ఉంటుంది. ఎక్కువ కాలం పాటూ ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల ఇతర ఆహారాలను తినడం తగ్గించుకుంటారు. కాబట్టి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. అందుకే బియ్యం దోశ కన్నా సగ్గు బియ్యం దోశ మంచి ఎంపిక అని చెప్పాలి. దీనిలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఎముకల బలానికి, రక్త హీనత సమస్యను తగ్గించడానికి సగ్గుబియ్యం సహకరిస్తాయి.

సగ్గు బియ్యం దోశ రెసిపీ తయారీ విధానం

కావాల్సిన పదార్థాలు

  • సగ్గుబియ్యం - ఒక కప్పు
  • బంగాళాదుంపలు - రెండు
  • పచ్చి మిరప - ఒకటి
  • జీలకర్ర - ఒక స్పూను
  • కొత్తిమీర - అర కట్ట
  • నూనె - ఒక స్పూను
  • శెనగపిండి - మూడు స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా

సగ్గు బియ్యం దోశ తయారీ ఇలా

  1. సగ్గుబియ్యాన్ని బాగా కడిగి అయిదు గంటలు నానబెట్టాలి. అవి మెత్తగా అయ్యాక నీటిని వడకట్టి ఒక గిన్నెలో వేయాలి.
  2. రెండు బంగాళాదుంపలను ఉడికించి వాటిని గిన్నెలో మెత్తగా చేత్తోనే మెదపాలి.
  3. ఆ గిన్నెల్లో శెనగపిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, ఉప్పు, జీలకర్ర వంటివి వేసి బాగా కలపాలి. వీటిన్నింటినీ చాలా మెత్తగా చేత్తోనే కలుపుకోవాలి. అవసరమైనంత నీటిని కలుపుకోవాలి.
  4. దోశెలా వేయడానికి వీలుగా ఆ మిశ్రమం అయ్యాక స్టవ్ మీద పెనం పెట్టాలి. పెనం వేడెక్కాక నూనె వేసి, ఈ మిశ్రమాన్ని దోశెలా పోసుకోవాలి.
  5. దోశ బంగారు రంగులోకి మారే దాకా ఉంచి రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. దీన్ని కొబ్బరి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Whats_app_banner