Dogs Vs Bikes : బైక్‍పై, కారులో వెళ్తుంటే కుక్కలు ఎందుకు వెంటపడతాయి? కారణాలు ఇవే-why dogs chase bikes and cars know the scientific reason behind it details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dogs Vs Bikes : బైక్‍పై, కారులో వెళ్తుంటే కుక్కలు ఎందుకు వెంటపడతాయి? కారణాలు ఇవే

Dogs Vs Bikes : బైక్‍పై, కారులో వెళ్తుంటే కుక్కలు ఎందుకు వెంటపడతాయి? కారణాలు ఇవే

Anand Sai HT Telugu
Nov 19, 2023 02:30 PM IST

Dogs Vs Bikes : బైక్‍పై, కారులో వెళ్తుంటే కుక్కలు వెంటపడటం అనేది దాదాపు అందరికీ జరిగే ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని రకాల కారణాలు దీని వెనక ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మనం బైకుపైనో.. కారులోనో ఏదో ఒక ప్రదేశానికి వెళ్తుంటాం. ఎక్కడో ప్రశాంతంగా పడుకున్న కుక్క ఆకస్మాత్తుగా మీదకు వస్తుంది. గట్టి గట్టిగా అరుస్తూ వెంబడిస్తుంది. మనకు ఏం చేయాలో తోచదు. దీంతో స్పీడుగా పోనిస్తాం. ఇలా చేసి యాక్సిడెంట్ అయినవారూ ఉన్నారు. స్పీడుగా వెళ్తుంటే.. కుక్కకు మరింత కోపం పెంచినట్టుగా అవుతుంది. అందుకే ఆగకుండా ఎంతైనా పరిగెడుతూ వస్తుంది. అసలు ఇలా వెంటాడేందుకు ఎందుకు వస్తుంది?

వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వీధికుక్కలు ఇలా మనల్ని వెంబడించడం చూశాం. కుక్కలు మన వాహనాలను పూర్తి శక్తితో వెంబడిస్తాయి. ఇలా కుక్కల వెంటపడటం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇలా వాహనాలను ఎందుకు వెంబడిస్తున్నాయనేది చాలా మందికి మిస్టరీగా ఉంటుంది. అయితే దీని మీద కొందరు రిసెర్చ్ కూడా చేస్తున్నారు. కుక్కలు వాహనాలను వెంబడించడానికి కారణం మనపై కోపం మాత్రం కాదు.

కుక్కలు వాహనాలను వెంబడించేదుకు ప్రధానమైన కారణం ఒకటి ఉంది. అదేంటంటే.. మన వాహనాలపై ఇతర కుక్కల మూత్రం వాసన రావడమే అందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లు, బైక్‌లపై కుక్కలు మూత్ర విసర్జన చేయడం చాలా సాధారణం. అవి ఎక్కడా ప్లేస్ లేనట్టుగా వెహికల్ మీదనే పోస్తాయి. ఈ వాసనను కుక్కలు చాలా దూరం నుంచి పసిగట్టగలవు. మనం దూరంగా ఉన్నప్పుడు మెల్లమెల్లగా అలర్ట్ అవుతాయి. దగ్గరకు రాగానే.. వాసన ఎక్కువై దాడి చేసేందుకు వచ్చినట్టుగా ప్రవర్తిస్తాయి. ఎంత స్పీడుగా వెళ్లినా వెంబడిస్తాయి.

అయితే ఇలా వేరే కుక్కల మూత్రం వాసనతో వెంబడించేందుకు కారణం ఉంది. అది ఏంటంటే.. ప్రతి కుక్క ఆ నిర్దిష్ట ప్రాంతాన్ని తమ నియంత్రణ ప్రాంతంగా భావిస్తుంది. ఇతర కుక్కలను ఆ ప్రాంతంలోకి అనుమతించవు. ఆ విధంగా వాహనం నుండి వచ్చే మూత్ర వాసనను పసిగడుతుంది. వేరే కుక్క తమ ప్రాంతంలోకి వస్తున్నట్టుగా భావిస్తుంది. అందుకే ఇతర కుక్కలు వాహనంపై ప్రయాణం చేస్తున్నాయని భావించి వెంటబడతాయి.

సాధారణంగా కొన్ని ప్రదేశాల్లో కుక్కల అరుపులు ఎక్కువగా వినిపిస్తాయి. అవి నిర్దిష్ట ప్రాంతాన్ని దాటి రావు. కానీ అరుచుకోవడం మాత్రం పెద్దగా ఉంటుంది. వాటి ప్రాంతంలోకి ఇతర కుక్కలు వస్తాయేమోనని ఉద్దేశంతో ఇలా అరుస్తాయి. వాటిని తరిమికొట్టేదాకా ఇలా చేస్తుంటాయి. ఇక వాహనాలను వెంబడించేందుకు మరో కారణం ఏంటంటే.. వాహనాల నుంచి ఏదైనా వింత శబ్ధం వచ్చినా కుక్కలు వెంబడిస్తాయి. కొంతమంది బైక్ నడుపుతూ.. వింత సౌండ్స్ చేస్తుంటారు. అలాంటి సమయంలో కుక్క వెంటపడటం మనం చూడొచ్చు.

ఇక మరో కారణం ఏంటంటే.. కుక్కలు వేటాడే జంతువులు వాహనంలో ఏదైనా ఆహారం ఉందని భావించి కూడా వెంబడించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అతివేగంగా కాకుండా నిదానంగా వాహనం నడిపితే కుక్కలు వెంటాడే ప్రమాదాలను నివారించవచ్చని అంటున్నారు. మనం స్పీడుగా వెళ్తుంటే.. అవి ఇంకా స్పీడుగా పరిగెత్తుతాయి. మనం ఒక్కసారి వాహనం ఆపేస్తే.. సైలెంట్‍గా వెళ్లిపోతాయి.

Whats_app_banner