Ganapati | వినాయకుడ్ని తులసి ఆకులతో పూజ చేయకూడదు.. ఎందుకో తెలుసా?-why basil is not offered to lord ganesha ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Basil Is Not Offered To Lord Ganesha

Ganapati | వినాయకుడ్ని తులసి ఆకులతో పూజ చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 05:16 PM IST

ఏ కార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఉండేందుకు ఆది దేవుడుగా భావించే వినాయకుడికి తొలి పూజ చేస్తుంటారు. అన్ని దేవుళ్ల కంటే ముందు వినాయకుడినే తలచుకుంటాం. మరి వినాయకుడిని తులసి ఆకులతో పూజ చేయకూడదని మీకు తెలుసా?

వినాయకుడు
వినాయకుడు (pixabay)

ఆది దేవుడైన వినాయకుడిని తులసి ఆకులతో లేదా మాలలతో పూజించం. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గ్రహించారా? తులసి ఆకులతో ఎందుకు పూజించమో, పురాణాల్లో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుడికి ‌ - తులసికి మధ్య గొడవ

వినాయకుడి పూజలో తులసిని నిషేధించడానికి ఓ కారణం ఉంది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవే ఇందుకు కారణమట. పురాణాల ప్రకారం... తులసి మాత విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే కోరికతో తపస్సు చేస్తుంది. ఈ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ నువ్వు కోరుకున్నట్లే విష్ణువును భర్తగా పొందుతావు. అతడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని చెప్తాడు. అప్పటినుంచి తులసి.. విష్ణువు కోసం బదరికా వనంలో ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక రోజు వినాయకుడు అక్కడికి వస్తాడు. విష్ణువు కోసం ఎదురుచూస్తున్న తులసి.. వినాయకుడినే విష్ణువు అనుకుని తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. వినాయకుడు ఎంత వారించినా ఆమె వినిపించుకోదు. దీంతో కోపగించిన వినాయకుడు నువ్వు నా పూజకు అనర్హురాలివంటూ శపిస్తాడు.

వినాయకుడు శపించగానే తులసిని కమ్మిన మాయ, మోహావేశాలు తొలగిపోతాయి. తులసి ఎంతగానో చింతించి, శాప విముక్తి చేయమని కోరుతుంది. దీంతో వినాయకుడు .. నీవు నాకు మాతృ సమానురాలవు. కాబట్టి తల్లి పుత్రుణ్ణి పూజించుట తగదని చెబుతాడు. ఈ కారణం వలనే వినాయకుని పూజకు తులసిని ఉపయోగించరు. ఒక వినాయక చవితి రోజున మాత్రమే తులసితో వినాయకుడిని పూజిస్తారు.

దానిమ్మ పూలంటే ఇష్టం

వినాయకుడికి 21 బిల్వదళాలతో పూజ చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అదే విధంగా దానిమ్మ పువ్వులంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం. దానిమ్మ పువ్వులతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

ఎర్రటి మందారాలతో వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు పూజ చేయటం వల్ల ఈతి బాధలు, సమస్త దోషాలు తొలగిపోతాయి. దేవదారు ఆకులతో వినాయకుడిని పూజిస్తే మనోధైర్యం చేకూరుతుంది.

వినాయకుడికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. వినాయకుడికి గరికతో పూజ చేయటం వల్ల ఆయన ప్రీతి చెంది గర్భస్థ శిశువుకు రక్షణ కల్పిస్తాడు. పుట్టబోయే బిడ్డకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తాడు.

WhatsApp channel

సంబంధిత కథనం