Thursday Motivation: మీ దృష్టిలో విజయం అంటే ఏమిటి? డబ్బు సంపాదించడమా? అనుకున్నది సాధించడమా?
Thursday Motivation: ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని అనుకుంటారు. కానీ ఒక్కొక్కరి దృష్టిలో విజయానికి ఒక్కో నిర్వచనం ఉంటుంది.
Thursday Motivation: విజయం అంటే ఏమిటి? మీ దృష్టిలో విజయానికి నిర్వచనం చెప్పండి. మీరు చెప్పే సమాధానమే అందరూ చెప్పాలని లేదు. వ్యక్తులు తమ జీవితాలు, అనుభవాలు, వ్యక్తిత్వాలు పరంగా భిన్నంగా విజయాన్ని నిర్వచిస్తారు. కావాలంటే ఒకసారి మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అడిగి చూడండి. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెబుతారు. అంతెందుకు మీకు పదిహేనేళ్ల వయసులో ఉన్న లక్ష్యం, పాతికేళ్లకు ఉండదు. విజయం నిర్వచనం కూడా వయసును బట్టి మారిపోతుంది.
ఒక వ్యక్తికి జీవితంలో డబ్బు సంపాదించడమే విజయం సాధించడంగా భావిస్తారు. కోటీశ్వరుడు అయితే చాలు తాను విజయం సాధించినట్టే ఫీలవుతాడు. ఒక నిరాశ్రయుడి దగ్గరికి వెళ్లి అతని జీవితంలో విజయమంటే ఏంటో అడిగి చూడండి. తానుండేందుకు చక్కటి ఇల్లు ఉంటే నిర్మించుకుంటే చాలు... అదే తనకు పెద్ద విజయమని అంటారు. ఏళ్లుగా ఒంటరితనంతో బాధపడుతున్న వారిని అడిగి చూడండి... తనకు చక్కటి తోడు దొరికితే తాను ప్రపంచాన్ని గెలిచినట్టేనని అంటారు.
విజయం అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమో, అంబానీలా కోట్లు సంపాదించడమో కాదు... జీవితంలో తమకు అత్యవసరమైనది సాధించడం. కొందరికి కలల ఇల్లు కట్టుకోవడమే అతిపెద్ద విజయం, మరికొందరికి ఒక పూట పొట్ట నిండా తన కుటుంబానికి అన్నం పెట్టడమే సక్సెస్ కావడం. ఒక వ్యక్తి ఉన్న పరిస్థితిని బట్టి విజయం నిర్ణయమవుతుంది.
కొందరికి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అదే విజయంగా భావిస్తారు.నిజానికి డబ్బు సంపాదనకు అంతు ఉండదు. అదే విజయం అనుకుంటే ఆ వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, అనుకున్నది మాత్రమే సాధించడం. మీరు మీ జీవితంలో ఎలా జీవించాలనుకుంటున్నారో...అలా జీవించగలిగితే మీరు విజయం సాధించినట్టే.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఉత్సాహం ఉన్నవారికి రోజులో ఖాళీ సమయమే దొరకదు. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు...మీకు జీవితంలో విలువైనదిగా భావించేది, మిమ్మల్ని సంతోషపరిచేది సాధించాలి. అప్పుడే మీరు నిజమైన విజేతలు.
మీకు జీవితంలో సాధించేందుకు ఏదీ లేదంటే అర్థం... మీరు బద్దకస్తులని. వారికి ఎదుగూ బొదుగూ ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేట్టుగా ఉంటుంది వీరి జీవితం.
విజయానికి... అపజయానికి చాలా చిన్న తేడానే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అందుకుని పైకి ఎగబాకేవాడు విజేత అవుతాడు. అవకాశం వచ్చినా పట్టించుకోకుండా బద్దకంగా కూర్చునే వాడు అపజయం పొందినట్టే లెక్క. మీరు రోజులో ఎక్కువ సేపు ఖాళీగా కూర్చుంటే మీకు జీవితంలో ఎదురయ్యేది అపజయమేనని ఫిక్స్ అయిపోండి. కాబట్టి మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకోండి. ఏదో ఒక పని చేస్తూనే ఉండండి.