Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి-sunday motivation these are the secrets of success of winners who have conquered the world follow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Haritha Chappa HT Telugu
May 19, 2024 05:00 AM IST

Sunday Motivation: విజేతగా నిలవాలంటే ఎంతో కష్టపడాలి. విజయాన్ని అందుకున్న వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకోవాలి. ప్రపంచంలో ఎంతోమంది విజేతలు ఉన్నారు. వారి విజయ రహస్యాలను తెలుసుకోండి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Sunday Motivation: జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో ఎంతోమంది ఉంటారు. కానీ వారికి మార్గదర్శకత్వం లోపిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది విజేతలు ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మీరు విజేతలుగా మారవచ్చు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ‘నువ్వు ఈ పని చేయలేవు’ అని మిమ్మల్ని వెనకే లాగి వ్యక్తులకు దూరంగా ఉండండి. నువ్వు ఏదైనా చేయగలవు అని ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయండి. ప్రపంచంలో విజేతగా నిలిచిన వారిలో ఎంతోమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని మీరు కూడా పాటించాలి.

అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం, మధ్యాహ్నం సమయానికి నిద్ర లేవడం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ప్రపంచాన్ని శాసించిన విజేతలు ఎవరైనా పాటించిన మొదటి సూత్రం... సూర్యుడి కన్నా ముందే లేవడం. మీ ఉద్యోగ పని వేళలను బట్టి మీ నిద్రను ఫిక్స్ చేసుకోండి. తగిన నిద్రా, ఆహారం కూడా శరీరానికి చాలా అవసరం. ఉదయానే సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాకితే 100 రెట్లు శక్తి శరీరంలో చేరినట్టు అనిపిస్తుంది. శరీరానికి చురుగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఉదయపు ఎండను శరీరానికి తాకేలా చూడండి.

ఉదయాన్నే వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. మీ దగ్గర కోట్ల ఆస్తి ఉన్న ఆరోగ్యం లేనప్పుడు మీరు ఏదీ సాధించలేరు. కాబట్టి సమయానికి తినడం, న్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా అవసరం. అలాగే మనసుకు ధ్యానం కూడా ముఖ్యం. ఈ అలవాట్లు ఆయుష్షును పెంచుతాయి.

డబ్బును సంపాదిస్తేనే అనుకున్న పనులు సఫలం అవుతాయి. కాబట్టి సవ్య మార్గంలో డబ్బులను సంపాదించేందుకు తగినంత సమయాన్ని, ప్రణాళికను వేసుకోవడం చాలా అవసరం. ధనార్జనకు ఉపయోగపడే పనులను రోజులో కొన్ని గంటలపాటు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు... డబ్బు సంపాదనకు ధర్మ మార్గంలో ఉన్న పనులను చేయండి.

రోజురోజుకీ మనిషి పురోగతి సాధిస్తూ ఉండాలి. నెల రోజుల క్రితం ఎలా ఉన్నారో... ఇప్పుడూ అలానే ఉంటే కష్టం. ఏడాది క్రితం ఎలా ఉన్నారో... ఏడాది తర్వాత మాత్రం మీ స్థానం కాస్త పైకి ఉండాలి. అప్పుడే మీరు పురోగతి సాధిస్తున్నట్టు మీ లక్ష్యానికి దగ్గరగా చేరువవుతున్నట్టు అర్థం.

మీకోసం ఆలోచించే వ్యక్తుల్లో మొదటి స్థానం మీ మనసుదే. ముందు మీతో, మీ మనసుతో మీరు మాట్లాడండి. జరుగుతున్న పరిణామాలు, జరగాల్సిన కార్యాల గురించి మాట్లాడుకోండి. ఆ తర్వాత మీ శ్రేయోభిలాషులతో మీ ఆలోచనలను పంచుకోండి.

ప్రతి మనిషికి ఏదో ఒక బలం ఉంటుంది. ఆ బలం ఏంటో తెలుసుకోండి. మీలో నాయకత్వ లక్షణాలు ఉంటే నాయకుడై ముందుకు నడవండి. మీతో పాటు మరింత మందిని నడిపించండి.

ఎంతటి రాజైనా తల్లికి కొడుకే కాబట్టి కుటుంబ విలువలను మరచిపోకండి. మీరు ఎంత విజయాన్ని సాధించినా మీ మూలాలు మరిచిపోవద్దు. తల్లీ, తండ్రి, భార్యా బిడ్డా అక్కా చెల్లి అందరినీ ఆదరించండి. కుటుంబంతో కలిసి జీవించడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.

WhatsApp channel