Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి-monday motivation dont look down on anyone you meet in life no matter how great they are ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Haritha Chappa HT Telugu

Monday Motivation: తానే గొప్ప అనుకొని ఎదుటివారిని చులకనగా చూసేవారు ఎంతోమంది. అలాంటి పనులను మానేయాలి. ఎవరి జీవితంలో వారు గొప్పవారే.

మోటివేషనల్ స్టోరీ (Pexels)

Monday Motivation: సీతాపురానికి వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంది. అది దారినపోయే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో నీడనిస్తుంది. తన పండ్లతో ఆకలి తీరుస్తుంది. అయినా కూడా ఆ చెట్టులోని భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు ఎప్పుడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూనే ఉంటాయి. నేను గొప్ప అంటే... నేను గొప్ప అంటూ పక్క వాటిని చులకనగా చూస్తాయి. ఎన్నోసార్లు చెట్టు వాటిని శాంత పరచడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఆకులు, వేర్లు, పండ్లు, కొమ్మలు తామే గొప్ప అని విర్రవీగడం మొదలుపెట్టాయి. ఒకదానికొకటి సహకరించుకోవడం మానేసాయి. ఒకరోజు చెట్టు వీటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది.

ఒకరోజు దారిని పోయే బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. చెట్టు ఎక్కి రెండు పండ్లు కోసుకొని తిని కాసేపు నీడలో పడుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు ఆ వ్యక్తిని ఇలా అడిగింది. ‘నాలో నీకు ఏ భాగం ఇష్టం’ అంది. అప్పుడు ఆ వ్యక్తి ‘నా ఆకలి తీర్చిన నీ పండ్లంటే చాలా ఇష్టం’ అని వెళ్ళిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు. కొన్ని వేర్లను కత్తిరించి పట్టుకెళ్లాడు. ఆ చెట్టు వైద్యున్ని కూడా అడిగింది. నాలో నీకు ఏం నచ్చుతుంది అని. దానికి ఆయుర్వేద వైద్యుడు ‘మీ వేర్లతో నాకు ఎంతో ఉపయోగం. ఎంతో మంది రోగాలకు నేను చికిత్స చేయగలుగుతున్నా. కాబట్టి అవంటేనే ఇష్టం’ అని వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ల తర్వాత ఒక వృద్ధుడు వచ్చాడు. మంచి ఎండాకాలం కావడంతో ఆయన ఎండకి విలవిలలాడుతూ చెట్టు కిందకు వచ్చాడు. చల్లని చెట్టు నీడలో సేద తీరాడు. రెండు పండ్లు తిన్నాడు. కాసేపు హాయిగా నిద్రించాడు. ఆ తర్వాత చెట్టు అతడిని అడిగింది... ‘ఎండ నుంచి ఉపశమనం కలిగిందా?’ అని. దానికి ఆ వృద్ధుడు ‘చాలా హాయిగా ఉంది. ఎందరికో నీడను, ఆకలిని తీరుస్తున్న నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి’ అన్నాడు. దానికి చెట్టు ‘నాలో నీకు ఏ భాగం ఇష్టమో చెప్పు’ అని అడిగింది. దానికి ఆ వృద్ధుడు ‘ఎండ నుంచి మీ ఆకులు, కొమ్మలు, జనాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. గాలి వీచేలా చేస్తాయి. ఇక వేర్లు ఉంటేనే చెట్టు నిలిచేది. ఆకులైనా, కొమ్మలైనా, పండ్లయినా విరిసేది. ఇక చెట్టు పండ్లు ఆకలి తీర్చడానికి చాలా అవసరం. కాబట్టి మీలోని అన్ని భాగాలు ముఖ్యమైనవే. నీలోని అన్ని భాగాలు ఒకదానికి ఒకటి సాటి. వేటినీ తక్కువగా చూడడానికి వీల్లేదు. అన్ని సమన్వయంతో పని చేస్తేనే నీవు బతకగలుగుతావు .జనాలకు మంచి చేయగలుగుతావు’ అని చెప్పి వెళ్లిపోయాడు

ఆ చెట్టు తనలోని భాగాలన్నిటికీ అతను చెప్పినది వివరించి చెప్పింది. దీంతో కొమ్మలు, వేర్లు, ఆకులు, పండ్లు అన్ని సిగ్గుతో తలదించుకున్నాయి.

జీవితంలో కూడా మీరు ఎవరినీ చులకనగా చూడకూడదు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి స్థాయిలో వారు మంచి పనులు చేయగలరు. ఎవరి స్థాయిలో వారు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులను నీచంగా చూడడం చులకనగా చూడడం మానేయండి.