Birth Tourism : బర్త్ టూరిజం అంటే ఏంటి? పెద్ద ప్లానింగే.. కానీ పరిస్థితులు మారాయి
Birth Tourism Meaning : గర్భిణులకు చాలా జాగ్రత్తలు అవసరం. ఈ సమయంలో ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తారు. కానీ బర్త్ టూరిజం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తారు.
గర్భిణులు ప్రసవం కాకముందే సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లడం గురించి మీరు విన్నారా? వారి దేశం, నగరం, గ్రామంలో నివసించడానికి అనుమతి లేదని కాదు. కానీ వేరే దేశానికి కావాలనే వెళ్తారు. వారి లక్ష్యం బర్త్ టూరిజం ద్వారా పిల్లలకు జన్మనివ్వడం. USA వంటి అభివృద్ధి చెందిన దేశాల పౌరసత్వాన్ని సాధించడం.
బర్త్ టూరిజం అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? బర్త్ టూరిజం అంటే వేరే దేశంలో బిడ్డకు జన్మనిచ్చే ఉద్దేశంతో సొంత దేశం నుంచి మరొక దేశం వెళ్లడం. బర్త్ టూరిజం ముఖ్య ఉద్దేశ్యం పిల్లలకు పౌరసత్వం పొందడం.
నివేదికల ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో పౌరసత్వం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ దేశంలో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవడం, ఎక్కువ కాలం అక్కడ నివసించిన తర్వాత పౌరసత్వం పొందడం మొదలైన మార్గాలున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నది బర్త్ టూరిజం.
అమెరికా, కెనడా, అర్జెంటీనా సహా 31 దేశాల్లో బిడ్డ పుడితే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. గర్భిణులు ఈ దేశాలలో ప్రసవించాలి. తద్వారా వారి పిల్లలు పౌరసత్వం పొందగలరు. ధనిక దేశాలలో మెరుగైన జీవితాన్ని గడపగలరు. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు బాగున్నాయని, భవిష్యత్తులో వారి పిల్లలకు కూడా అనేక అదనపు సౌకర్యాలు లభిస్తాయని తల్లిదండ్రులు ఈ ప్లాన్స్ వేస్తారు. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. దీంతో అమెరికా వంటి కొన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.
కొద్దిరోజుల క్రితం రష్యాకు చెందిన గర్భిణులు అర్జెంటీనాకు పారిపోతూ పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. బ్యూనస్ ఎయిర్స్ విమానాశ్రయంలో వారిని విచారించగా బర్త్ టూరిజం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మహిళలు ప్రసవానికి కొన్ని రోజుల ముందు అర్జెంటీనాకు వెళ్లారు. అమెరికాలో చాలా కంపెనీలు ఈ ప్రయోజనం కోసం పర్యటనలు నిర్వహిస్తాయి. వారికి రాయితీ ధరలకు హోటల్, వైద్య సదుపాయాలు కూడా అందిస్తాయి. ఇందుకోసం చైనా, రష్యా సహా పలు దేశాల నుంచి గర్భిణులు అమెరికా వెళుతున్నారు. దీంతో పొరుగు దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెంది ఆంక్షలు విధించడం ప్రారంభించాయి.
ఇప్పుడు యూఎస్ టూరిస్ట్ వీసాలపై వచ్చే గర్భిణులు ప్రసవించడానికి అక్కడ లేరని నిరూపించాలి. బర్త్ టూరిజం కోసం తాత్కాలిక B-1, B-2 వీసాలు కూడా జారీ చేయరు. బర్త్ టూరిజం వల్ల ఆసుపత్రులపై అదనపు భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఆంక్షలు విధిస్తున్నారు.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2019 లో వేరే దేశాల నుండి యూఎస్ వచ్చిన మహిళలకు సుమారు 12,000 మంది పిల్లలు జన్మించారు. 2017లో ఈ సంఖ్య 10,000, 2007లో 7,800గా ఉంది. కెనడాలో ఉన్నప్పుడు పర్యాటకానికి వచ్చి సుమారు 6,000 మంది పిల్లలు జన్మించారని భావిస్తున్నారు. అర్జెంటీనాలో 3,000 మందికి పైగా పిల్లలు జన్మించారు.
ఐర్లాండ్‌తో సహా అనేక దేశాలు దీనిని నిషేధించాయి. పేద దేశాల నుండి చాలా మంది మహిళలు బర్త్ టూరిజం మార్గాన్ని అనుసరిస్తారు. బర్త్ టూరిజం ద్వారా పుట్టిన పిల్లలను యాంకర్ బేబీస్ అంటారు. అంటే వీరి తల్లిదండ్రుల పౌరసత్వం వేరే దేశంలో ఉంటుంది. కానీ బిడ్డకు పౌరసత్వం వచ్చేందుకు తల్లిదండ్రులు డెలివరీ కోసం మరొక దేశం వస్తారు.