Rowdysheeter Birthday: పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఎస్సై బదిలీ
Rowdysheeter Birthday: ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించాల్సిన కొందరు పోలీసులు అధికారులు తరచూ గాడి తప్పుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నవారు కొందరైతే.. అన్నీ తెలిసీ రూల్స్ బ్రేక్ చేస్తున్న అధికారులు ఇంకొందరున్నారు.
Rowdysheeter Birthday: భూపాలపల్లి జిల్లాలో గీటు దాటిన పోలీస్ అధికారిపై వేటు పడింది. పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన పోలీస్ అధికారి తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఓ ఎస్సై.. విచక్షణ మరిచి పోలీస్ స్టేషన్ నే బర్త్ డే పార్టీకి అడ్డాగా మార్చారు. అది కూడా ఓ రౌడీ షీటర్ పుట్టిన రోజు వేడుకలు పోలీస్ స్టేషన్ లోనే ఘనంగా నిర్వహించి, ప్రజల అసహనాన్ని ఎదుర్కొన్నారు. చివరకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై అక్కడి నుంచి వేరే చోటుకి బదిలీ అయ్యారు. దీంతో జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర చర్చ నడుస్తోంది.
అసలేం జరిగింది..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కొంతకాలంగా మాధవ్ గౌడ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్చి 4వ తేదీన మొగుళ్లపల్లికి చెందిన ఓ రౌడీ షీటర్ బర్త్ డే కావడం.. అతను తన సామాజిక వర్గానికి చెందిన కావడంతో స్టేషన్ కు పిలిపించి మరీ సెలబ్రేషన్స్ చేశారు.
ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నా కూడా పట్టించుకోకుండా రౌడీ షీటర్ ను స్టేషన్ లోపలికి రప్పించడంతో పాటు మరికొంత మందిని పోగు చేసి సంబరాలు జరిపారు.
కేకు కోసి రౌడీ షీటర్ కు తినిపించారు. సదరు రౌడీ షీటర్ గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. క్రైమ్ రికార్డ్ ఉన్న వ్యక్తి పుట్టిన రోజు సంబరాలు స్టేషన్ లో జరపడం, ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ ఫొటోలకు ఫోజు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై శ్రద్ధ చూపకుండా, పోలీస్ స్టేషన్ ను బర్త్ డే పార్టీ అడ్డాగా మార్చడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు ఆపద వస్తే భరోసానిచ్చేందుకు కృషి చేయాల్సిన పోలీస్ అధికారులు రౌడీ షీటర్లను ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.
ఎస్సై తీరును ఎండగడుతూ కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా రౌడీ షీటర్, స్టేషన్ ఎస్సై ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సదరు ఎస్సై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడంటూ కొంతమంది నెటిజన్లు మండిపడ్డారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎస్సై పై చర్యలు తీసుకోవాలని ప్రజలు, నెటిజన్లు విజ్ఞప్తి చేశారు.
విచారణ జరిపి.. వెంటనే యాక్షన్
మార్చి 4న సాయంత్రం స్టేషన్ లో బర్త్ డే సంబరాలు జరగగా.. ఎస్సై రౌడీ షీటర్ కు కేక్ తినిపిస్తున్న ఫొటోలు మార్చి 5న వైరల్ అయ్యాయి. దీంతో విషయం జయశంకర్ భూపాలపల్లి పోలీస్ ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో ఎస్సై మాధవ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఎస్సై మాధవ్ గౌడ్ పై బదిలీ వేటు వేశారు. మొగుళ్లపల్లి నుంచి ఆసిఫాబాద్ జిల్లా వీఆర్ కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం సృష్టించగా.. జిల్లాలో మరికొందరు అధికారులు కూడా రౌడీ షీటర్లు, భూకబ్జాదారులకు వంతపాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు పోలీస్ అధికారులు భూ ఆక్రమణదారులతో దోస్తీ చేస్తూ అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రౌడీ షీటర్లను హడలెత్తిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, వారినే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మాధవ్ గౌడ్ తీరుతో పోలీసుల వ్యవహార శైలిపై జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతుండగా.. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)