Bird Flu: ఏమిటి బర్డ్ ఫ్లూ వైరస్? ఇది మనుషులకు సోకే అవకాశం ఉందా? సోకితే మరణిస్తారా?-what is bird flu virus can it infect humans will you die if you get infected ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bird Flu: ఏమిటి బర్డ్ ఫ్లూ వైరస్? ఇది మనుషులకు సోకే అవకాశం ఉందా? సోకితే మరణిస్తారా?

Bird Flu: ఏమిటి బర్డ్ ఫ్లూ వైరస్? ఇది మనుషులకు సోకే అవకాశం ఉందా? సోకితే మరణిస్తారా?

Haritha Chappa HT Telugu
Feb 18, 2024 06:54 PM IST

Bird Flu: బర్డ్స్ ఫ్లూ మళ్లీ వ్యాపించడం మొదలుపెట్టింది. ఈ వైరస్ వల్ల ఎన్నో కోళ్లు మరణిస్తున్నాయి. అయితే ఈ వైరస్ మనుషులకు సోకుతుందా? లేదా? అనే సందేహం ఎక్కువ మందికి ఉంది.

బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు వస్తుందా?
బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు వస్తుందా? (pixabay)

Bird Flu: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ వైరస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో ఉంది. అసలు ఇది మనుషులకు సోకుతుందా? ఈ వైరస్ సోకితే కోళ్లు, పక్షుల్లాగే మనుషులూ మరణిస్తారా? ఇలా అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

ఏమిటీ బర్డ్ ఫ్లూ వైరస్?

హెచ్5ఎన్1 వంటి ఏవీయన్ ఇన్‌ఫ్లూయేంజా వైరస్ కొన్ని పక్షులకు సోకుతుంది. దీన్నే బర్డ్ ఫ్లూ అంటారు. ఆ పక్షులకు దగ్గరగా మిగతా పక్షులు వెళ్తే వాటికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ కారణంగా కోళ్లు, పక్షులు త్వరగా మరణిస్తాయి. వాటి మృతదేహాల దగ్గరకు ఇతర పక్షులు వెళ్లినా కూడా ఈ వైరస్ సంక్రమించడం చాలా సులువు. అలాగే పక్షి కళ్ళు, నోటి నుంచి వచ్చే ద్రవాలు, అలాగే పక్షుల రెట్టల ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన తరువాత పక్షుల్లో పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనివల్లే బర్డ్ ఫ్లూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్కువగా వలస పక్షులే ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది.

మనుషులకు సోకుతుందా?

పక్షులతో వ్యాపారం చేసేవాళ్లు, కోళ్ల ఫారం నడిపేవారు ఎక్కువగా వాటితో గడపాల్సి వస్తుంది. అలాంటివారికి ఈ వైరస్ సోకి అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా మనుషులు మరణించే శాతం మాత్రం చాలా తక్కువ. అలాగే ఈ బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల నుంచి ఇతర మనుషులకు అది వ్యాపించదు. అయితే ఈ వైరస్ కరోనా లాగే మ్యుటేషన్ చెంది బలంగా మారి మనుషుల్లో కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధిస్తే మాత్రం మానవాళి ప్రమాదంలో పడినట్టే. ప్రస్తుతానికైతే బర్డ్ ఫ్లూ మనుషులను ఏమీ చేయలేకపోతోంది.

బర్డ్ ఫ్లూ సోకినప్పుడు మనుషుల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వారికి దగ్గు, తలనొప్పి, జ్వరము, జలుబు, కండరాల నొప్పులు వస్తాయి. కొంతమంది జ్వరంతో వణికి పోతారు. ఈ లక్షణాలన్నీ సాధారణ జ్వరం సమయంలో కూడా కనిపించేవే. కాబట్టి మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందని కనిపెట్టడం కాస్త కష్టమే. యాంటీ వైరల్ మందులు వేసుకోవడం ద్వారా ఈ బర్ట్ ఫ్లూ నుంచి బయటపడవచ్చు. పారాసిటమాల్ కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. ప్రస్తుతానికైతే దీని వల్ల మనుషులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.

ఈ సమయంలో చికెన్ తినొచ్చా?

చాలామందికి ఈ సందేహం వేధిస్తుంది. బర్డ్ ఫ్లూ వల్ల ఎక్కువ కోళ్లు చనిపోతున్న సమయంలో చికెన్‌ను తినడం ప్రమాదకరమేమో అనుకుంటారు. నిజానికి చికెన్ ఎక్కువ సమయం పాటు వండితే ఆ వైరస్ చనిపోతుంది. కాబట్టి చికెన్ ను తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ ఉడికీ ఉడకని చికెన్ తింటే మాత్రం ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి బర్డ్ ఫ్లూ సోకుతున్న సమయంలో చికెన్, గుడ్లు వంటి వాటిని బాగా ఉడికించి తినాలి. దీనివల్ల వాటిల్లో ఉన్న ఎలాంటి వైరస్ అయిన అధిక ఉష్ణోగ్రత వద్ద మరణిస్తాయి. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు ఎలాంటి హాని చేయవు.

Whats_app_banner