Nipah virus : నిపా వైరస్​ అంటే ఏంటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కొవిడ్​ కన్నా ప్రమాదకరమా?-what is nipah virus check symptoms treatment options ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nipah Virus : నిపా వైరస్​ అంటే ఏంటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కొవిడ్​ కన్నా ప్రమాదకరమా?

Nipah virus : నిపా వైరస్​ అంటే ఏంటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కొవిడ్​ కన్నా ప్రమాదకరమా?

Sharath Chitturi HT Telugu
Sep 16, 2023 09:20 AM IST

What is Nipah virus : నిపా వైరస్​ లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి చికిత్స ఉందా? కొవిడ్​ కన్నా ఈ వ్యాధి ప్రమాదకరమా? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..

నిపా వైరస్​ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
నిపా వైరస్​ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? (PTI)

What is Nipah virus : కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్​ వణికిస్తోంది. ఇప్పటివరకు ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాధి సోకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు హై అలర్ట్​లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అసలు ఈ నిపా వైరస్​ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నిపా వైరస్​ అంటే ఏంటి..?

గబ్బిలాలు, పందుల నుంచి మనిషికి వ్యాపించేదే ఈ నిపా వైరస్​. కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన కొవిడ్​ తరహాలోనే ఇదీ ఉంటుంది. తొలుత జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత.. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది.

ఈ నిపా వైరస్​కు ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడం, వ్యాక్సిన్​ సైతం అందుబాటులో లేకపోవడం ఆందోళనకర విషయం.

నిపా వైరస్​ లక్షణాలు ఎలా ఉంటాయి..?

Nipah virus symptoms : నిపా వైరస్​ లక్షణాలు స్వల్పంగా ఉండొచ్చు. లేదా ప్రాణాంతకంగా కూడా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) చెబుతోంది. ఉపిరితిత్తుల్లో స్వల్పంగా సమస్యల నుంచి ప్రమాదకరమైన ఎన్సిఫిలైటిస్​ వరకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ వ్యాధి ముదిరితే మాత్రం.. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత పెరిగిన 24 గంటలు నుంచి 48 గంటల్లో సంబంధిత మనిషి కోమాలోకి జారుకునే ప్రమాదం కూడా ఉందని డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది.

నిపా వైరస్​ సోకిన 14 రోజులు- 45 రోజుల మధ్యలో వ్యాధి నయమవుతుంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారిలో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ 20శాతం మందిలో నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని డబ్ల్యూహెచ్​ తెలిపింది.

నిపా వైరస్​కు చికిత్స ఉందా..?

Kerala Nipah virus : ప్రస్తుతానికైతే.. నిపా వైరస్​కు ప్రత్యేకించి ఎలాంటి చికిత్స లేదు. వ్యాక్సిన్​ కూడా అందుబాటులో లేదు. ఐసీయూలో పెట్టి చికిత్స మాత్రమే అందిస్తారు.

అయితే ఈ వైరస్​ తీవ్రత తగ్గించేందుకు మోనోక్లోనల్​ యాంటీబాడీ డోసులను వాడుతారు. కేరళలో కేసుల పెరుగుదల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా నుంచి వీటిని రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

కొవిడ్​ అంత ప్రమాదమా?

కొవిడ్​తో పోల్చుకుంటే.. నిపా వైరస్​ సోకిన వారిలో మరణాల రేటు చాలా ఎక్కువ అని ఐసీఎంఆర్​ (ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికిల్​ రీసెర్చ్​) చీఫ్​ డా. రాజివ్​ బల్​ తెలిపారు. నిపా వైరస్​ మోర్టాలిటీ రేటు 40-70శాతం మధ్యలో ఉంటుందని వెల్లడించారు. కొవిడ్​ విషయానికొస్తే అది కేవలం 2-3శాతమని స్పష్టం చేశారు.

కేరళలో తాజా పరిస్థితులు ఇలా..

Nipah virus death toll in Kerala : కేరళలో 2018లో తొలిసారిగా నిపా వైరస్​ కలకలం సృష్టించింది. నాడు 21మందిని బలి తీసుకుంది. 2019, 2021లోనూ ఈ ప్రాణాంతక వ్యాధి.. కేరళను ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఇప్పుడు.. రాష్ట్రాన్ని వణికిస్తోంది. మరీ ముఖ్యంగా.. కొజికోడ్​ జిల్లాలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి.

ఈ నేపథ్యంలో కొజికోడ్​ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 24 వరకు సెలవును ప్రకటించింది. ఆన్​లైన్​ క్లాసులు నిర్వహణకు అనుమతులిచ్చింది.

మరోవైపు ఆరుగురు రోగులు కలిసిన, సన్నిహితంగా ఉన్న వారిని ట్రేస్​ చేస్తోంది ఆరోగ్య యంత్రాంగం. ఇప్పటివరకు 1080 మందిని గుర్తించినట్టు వెల్లడించింది. వీరిలో 327మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్టు స్పష్టం చేసింది.

నిపా వైరస్​ కారణంగా ఆగస్ట్​ 30న కేరళలో తొలి మరణం సంభవించింది. సంబంధిత వ్యక్తి అంత్యక్రియల్లో 17మంది పాల్గొన్నారు. వీరందరు ప్రస్తుతం ఐసొలేషన్​లో ఉన్నారు.

కేరళలో నిపా వ్యాప్తి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకు కూడా అప్రమత్తమైంది. అత్యవసరమైతేనే.. కేరళకు వెళ్లాలని సూచించింది.

WhatsApp channel

సంబంధిత కథనం