Wednesday Motivation: ప్రేమించిన వారికోసం ప్రేమగా తగ్గండి, ఆజ్ఞాపించడం మాని ఆప్యాయంగా చెప్పండి, అప్పుడు అందరూ మీ వెంటే
Wednesday Motivation: ప్రేమగా చెప్పితే ఎవరైనా వింటారు. అదే శాసిస్తే... ఎవరైనా దూరం జరుగుతారు. మీ పనులు చక్కగా సాగాలంటే, ఇంట్లో సానుకూల వాతావరణము ఉండాలంటే మీరు ముందు ప్రేమగా మాట్లాడడం. ప్రవర్తించడం నేర్చుకోండి.
Wednesday Motivation: ప్రేమంటే ఒకరి భావాలను ఒకరికి వివరించేందుకు పుట్టిన ఒక అందమైన పదం. ప్రేమ అనేది ఒక వ్యక్తికి మరో వ్యక్తి పట్ల ఉన్న నిస్వార్ధమైన, నమ్మకమైన అనుభూతి. మనకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి మీద ప్రేమ పుట్టదు. కొందరి మీద మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది. ప్రేమంటే ఒక ఆప్యాయత, ఓదార్పు, సంరక్షణ, మద్దతు. చంటి బిడ్డను తల్లి హత్తుకోగానే కలిగే ఆ ప్రేమ అనుభూతి వారిద్దరికే తెలుస్తుంది. ప్రేమంటే కేవలం ఇద్దరు యువతీ యువకుల మధ్య పుట్టినదే కాదు. ఏ అనుబంధం మధ్యయినా ప్రేమ ఉంటుంది. ప్రేమతో నిండిన ఇల్లు సకల సంపదలతో ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా వర్ధిల్లుతుంది. అందుకే ఇంట్లోని వారు మీ మాట వినాలంటే... మీరు ప్రేమగా చెప్పాలి. కానీ ఆజ్ఞాపించడం, శాసించడం చేయకూడదు. ప్రేమతో చెబితే... అంతే ప్రేమతో ఎదుటివారు తగ్గిపోతారు. మీ మాట వింటారు.
ప్రేమతో కూడిన ఒక్క మాట చాలు అద్భుతాలు నేను సృష్టిస్తుంది. రక్తసంబంధం లేకపోయినా కూడా ప్రేమ ఎదుటివారిని లొంగదీస్తుంది. ఇంట్లో మీ ఆధిపత్యాన్ని, మనుషులపైనే పెద్దరికాన్ని రుద్దాలనుకుంటే వారు మీకు దూరం అవుతారు. అదే ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడి చూడండి. మీరు చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్తారు. ప్రేమించిన వారిని దగ్గరకు తీసుకోవాలంటే వారికి శాసనాలు రాయకండి. ప్రేమతో అల్లుకోండి చాలు. ఒక మనిషి మీకు దూరం అవుతున్నారంటే మీరు వారి పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటారు. లేకపోతే ఏ మనిషి ఇతరులను వదులుకోవడానికి ఇష్టపడరు. అదే మీరు ప్రేమగా మాట్లాడితే ఎవరైనా మీ చుట్టూ తిరగాల్సిందే. ప్రేమ పంచటంలో ఉన్న మాధుర్యం అనుభవించారంటే మీరు దానికి దాసోహం అయిపోతారు.
ఇంట్లో చాలామంది పెద్దరికం పేరుతో తమకన్నా చిన్న వారిపై అధిపత్యం చలాయించేందుకు చూస్తూ ఉంటారు. అది కుటుంబాలు విడిపోయేందుకు కారణం అవుతాయి. అలా కాకుండా వారితో ప్రేమగా మాట్లాడి చూడండి. వారు నిత్యం మీ చుట్టూనే తిరుగుతారు. మీరు కోపంలో ఒక మాట అన్నా కూడా పట్టించుకోరు. శివగామిలా శాసిస్తామంటే ఎవరూ మీ చుట్టూ మిగలరు. ఆప్యాయంగా చేయి చాస్తేనే అందరూ మీ అక్కరకు వచ్చేది.
ప్రేమంటే పొందటమే కాదు ఇవ్వడం కూడా. ముందు మీరు ప్రేమను ఇచ్చి చూడండి, అంతే రెట్టింపు ప్రేమ అటు నుంచి మీరు కూడా అందుకుంటారు. ప్రేమించడమే గొప్ప కాదు. ఒకరి చేత ప్రేమించబడడం కూడా అద్భుతమైన వరమే. అది కేవలం అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ కానక్కర్లేదు. ఒక యజమాని కార్మికుడి మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత కూడా కావచ్చు . అలాగే భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, స్నేహితులు... ఇలా ఎవరి మధ్య అయినా ప్రేమ అందంగా, ప్రశాంతంగా ఉండాలి. అంతే తప్ప సరిహద్దులతో, శాసనాలతో, ఆదిపత్యాలతో నిండిపోతే ఆ బంధం త్వరగా విరిగిపోతుంది. ప్రేమ కోసం మీరు ప్రేమగా తగ్గితే ఎలాంటి తప్పులేదు. మరింత మంది మీకు అండగా నిలిచేందుకు వస్తారు. ఒక్కసారి ఇంట్లో వారిని లేదా మీ స్నేహితులను ప్రేమగా పిలిచి చూడండి. ఆ ప్రేమకు వారు కరిగిపోకుండా ఉండరు. వీలైనంతవరకు ప్రేమించండి. ద్వేషించడం వల్ల వచ్చేది కోపం, అశాంతి, ఆందోళన మాత్రమే. అవి జీవితంలో మీకు ఎందుకూ పనికిరావు. ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి తప్ప.