Valentines day Hyderabad: వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులకు హైదరాబాదులో బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే-valentines day hyderabad these are the best destinations for lovers in hyderabad on valentines day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day Hyderabad: వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులకు హైదరాబాదులో బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే

Valentines day Hyderabad: వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులకు హైదరాబాదులో బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే

Haritha Chappa HT Telugu
Feb 05, 2024 09:00 AM IST

Valentines day Hyderabad: ఉద్యోగాల వల్ల ఎక్కువమంది హైదరాబాదుకు చేరుకుంటున్నారు. ఎన్నో రాష్ట్రాల వారు కూడా ఇక్కడ ఉంటున్నారు. హైదరాబాదులో ప్రేమికులు తిరిగేందుకు అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాలెంటైన్స్ డే రోజు వీటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని రొమాంటిక్ డేట్ కి ప్లాన్ చేయండి.

వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే (pexels)

Valentines day Hyderabad: హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రాముఖ్య నగరం. హైదరాబాదులో కలిసి ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రేమికులు వాలెంటైన్స్ డే రోజు రొమాంటిక్ డేట్‌కు ఎక్కడికి వెళ్లాలో ఆలోచిస్తూ ఉంటారు. వాలెంటెన్స్ డే రోజు ఒక్కరోజులోనే ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటే హైదరాబాద్ సిటీని దాటకుండానే మీ రొమాంటిక్ డేట్ ను ప్లాన్ చేసుకోండి. ఈ నగరంలో ఎన్నో విలాసవంతమైన హోటళ్లు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాలెంటైన్స్ డే కు ఎంతో ప్రత్యేకంగా సిద్ధమవుతాయి. ప్రేమికుల రోజు నాడు మీరు హైదరాబాదులో ఎక్కడెక్కడ ఎంజాయ్ చేయవచ్చో ఒకసారి తెలుసుకోండి.

నెక్లెస్ రోడ్

నెక్లెస్ రోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఎంతోమంది ప్రేమికులకు ఇది అడ్డా. హైదరాబాదులో నెక్లెస్ రోడ్డు తెలియని వారి సంఖ్య చాలా తక్కువ. అర్ధరాత్రి వరకు ప్రేమ పక్షులు అక్కడ తిరుగుతూనే ఉంటారు. ట్యాంక్ బండ్ చుట్టూ లైట్లతో నెక్లెస్ లా మెరిసిపోతుంది ఈ రోడ్డు. ఇక్కడ మంచి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అలాగే దీనికి దగ్గరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్ వంటివి కూడా ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 10:30 వరకు నెక్లెస్ రోడ్ లో ఎంజాయ్ చేయవచ్చు.

ఈట్ స్ట్రీట్

నెక్లెస్ రోడ్డుకు పక్కనే ఉంటుంది ఈట్ స్ట్రీట్. ఇందులో అనేక రకాల ఆహారాలు దొరుకుతాయి. అంతేకాదు ఓ పక్కన హుస్సేన్ సాగర్ ను చూస్తూ ఆహారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఓపెన్ ఫుడ్ కోర్ట్. మీకు నచ్చిన వారితో ఎంత సేపైనా ఇక్కడ ఉండవచ్చు. పిజ్జాల దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్ని రకాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా హైదరాబాదీ, మొఘలాయి వంటకాలను రుచి చూడాలంటే ఈ ఓపెన్ రెస్టారెంట్ కి వెళ్ళండి. పచ్చదనం మధ్యలో కూర్చుని ఎంచక్కా మీ రొమాంటిక్ డేట్ ను హ్యాపీగా గడపవచ్చు. ఇది ఉదయం 9 నుంచి రాత్రి 11:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది.

గోల్కొండ

మీ ప్రియమైన వారితో ఎక్కువసేపు గడిపేందుకు ప్రైవసీ కావాలనుకుంటే గోల్కొండ కోటకు వెళ్ళండి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి జంటలుగా తిరుగుతూ ఉంటారు. మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. దీన్ని మొదట్లో గొల్ల కొండ అని పిలిచేవారు. తర్వాత గొర్లకొండ అని మారింది. ఇప్పుడు దాన్ని గోల్కొండ గా మార్చారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి సాయంత్రం ఐదున్నర వరకు గోల్కొండలో ఉండవచ్చు.

దుర్గం చెరువు

ఐటీ ఆఫీసుల మధ్యలో పైన వేలాడే తీగల వంతెనతో హుందాగా ఉంటుంది దుర్గం చెరువు. అక్కడ ఎన్నో సినిమా షూటింగులు అయ్యాయి, పెడల్ బోట్, మేకనైజ్డ్ బోట్, వాటర్ స్కూటర్ వంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ చెరువులో వీటన్నిటి మీద మీరు తిరగవచ్చు. కావాలంటే కాసేపు చెరువు చుట్టూ వాకింగ్ కు వెళ్లవచ్చు. అక్కడ ఉండే ఫుడ్ కోర్టులో మంచి ఆహారం కూడా దొరుకుతుంది. ఇది ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది.

ఆలివ్ బిస్ట్రో

హైదరాబాదులోని సీక్రెట్ లేక్‌గా పిలిచే దుర్గం చెరువుకు దగ్గరగా ఉంటుంది ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్. క్యాండిల్ లైట్ డిన్నర్ కు ఇది మంచి డెస్టినేషన్. అత్యుత్తమ వైనులతో పాటు అనేక రకాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. వాలెంటైన్స్ డేకు బెస్ట్ డెస్టినేషన్ ఇది. ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ప్రేమికులిద్దరికీ 2000 ఖర్చు అవుతుంది. దీనిలో ఆల్కహాల్ కూడా ఇస్తారు.

లిటిల్ ఇటలీ

ఇటాలియన్ ఫుడ్‌ను ఇష్టపడే ప్రేమికుల కోసం డిన్నర్ డేట్‌ను ప్లాన్ చేసేవారు. ఇటలీ ఫుడ్ తినాలనిపిస్తే లిటిల్ ఇటలీకి వెళ్ళండి. ఇది ఫిల్మ్ నగర్, హైటెక్ సిటీలో ఉంది. కేవలం ఈ రెండు చోట్ల రెండు బ్రాంచ్ లు మాత్రమే ఉన్నాయి. ఉదయం ఏడు నుంచి రాత్రి 11 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ప్రేమికులు ఇద్దరికీ 2000 రూపాయల వరకు ఖర్చవుతుంది. లిటిల్ ఇటలీ రెస్టారెంట్లో బఫే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత కావాలంటే అంత తినవచ్చు.

డైలాగ్ ఇన్ ది డార్క్

క్యాండిల్ లైట్ డిన్నర్లను మించిన అనుభూతి కావాలంటే ‘డైలాగ్ ఇన్ ది డార్క్’ రెస్టారెంట్ కు వెళ్లండి. ఇది హైటెక్ సిటీలో ఉన్న ఇనార్బిట్ మాల్ ఐదవ అంతస్తులో ఉంది. మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు ఇది ఓపెన్ గా ఉంటుంది. అలాగే రాత్రి 7:30 నుంచి 9:30 వరకు నడుస్తుంది. ఇద్దరు వెళ్తే 1300 రూపాయల ఖర్చు అవుతుంది. చీకటిగా ఉండి వారు తినే టేబుల్ మాత్రమే కాస్త వెలుగు ఉంటుంది. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరూ రొమాంటిక్ మూడ్లోకి ఈజీగా వెళ్ళిపోతారు. హైదరాబాదులో ఒక్కరోజులోనే వెళ్లి వచ్చే రొమాంటిక్ డిస్టినేషన్లు ఇవి. ఒకసారి మీకు నచ్చిన వాటిని ప్లాన్ చేసుకోండి.

Whats_app_banner