Vellulli kodiguddu Recipe: వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా చేశారంటే కొంచెం కూడా మిగలదు, రెసిపీ చాలా సులువు
Vellulli kodiguddu Recipe: స్పైసీ పచ్చళ్ళు అంటే మీకు ఇష్టమా? అయితే ఒకసారి వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడిని ట్రై చేయండి. ఇది నిల్వ కూడా ఉంటుంది. చికెన్, మటన్ పచ్చడిలాగే కోడిగుడ్డుతో టేస్టీ పచ్చడిని చేసుకోవచ్చు.
Vellulli kodiguddu Recipe: రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఎలా పెట్టుకుంటామో... అలా కోడి గుడ్డుతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. ఒకసారి వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా స్పైసీ వంటకాలనీ ఇష్టపడే వారికి ఈ పచ్చడి మంచి ఎంపిక. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు రెసిపీ చూద్దాం.
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - మూడు
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
లవంగాలు - రెండు
దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క
యాలకులు - రెండు
నిమ్మరసం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
మెంతిపొడి - చిటికెడు
గరం మసాలా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
కారం - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి రెసిపీ
1. కోడిగుడ్లను ఉడికించుకొని పైన పొట్టు తీసి లోపల ఉన్న పచ్చ సొనను తీసి పక్కన పెట్టేయాలి.
2. ఇప్పుడు ఆ తెల్ల భాగాన్ని ముక్కలుగా కోసుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ముక్కలుగా కోసుకున్న ఈ తెల్ల గుడ్డు ముక్కలను వేయించుకోవాలి.
4. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మిక్సీలో ఎండు మిర్చి, వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త నీరు వేసి పేస్టులా రుబ్బుకోవాలి.
6. కళాయిలో మిగిలిన నూనెలో చిటికెడు ఇంగువ వేయాలి. తర్వాత మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
7. దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేయాలి.
8. ఇది చేస్తున్నప్పుడు మంట చిన్నగా ఉండేలా చూసుకోవాలి.
9. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వంటివన్నీ వేసి కలుపుకోవాలి.
10. స్టవ్ కట్టేశాక బాగా చల్లారనివ్వాలి. అది చల్లారాక పైన నిమ్మరసాన్ని చల్లుకోవాలి.
11. అంతే వెల్లుల్లి కోడి గుడ్డు పచ్చడి రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది. ఇందులో మనం తెల్ల గుడ్డు భాగాన్ని మాత్రమే వినియోగించాం, కాబట్టి ఎలాంటి వాసన రాదు. ఎక్కువ కాలం నిలువ కూడా ఉంటుంది. దీన్ని ఒకసారి చేసుకుంటే కనీసం నెల రోజులు పాటు తినవచ్చు. వెల్లుల్లిలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజూ భోజనం చేసేముందు ఈ పచ్చడితో రెండు ముద్దలు తినడం అలవాటు చేసుకోండి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. స్పైసీగా కావాలనుకునేవారు ఎండు మిర్చిని, కారాన్ని అధికంగా వేసుకుంటే సరిపోతుంది. మధ్యస్థంగా తినే వారికి ఒక స్పూన్ కారం సరిపోతుంది. పచ్చసొన వాడితే మాత్రం వాసన వేసే అవకాశం ఉంది. అలాగే దాని వారం రోజుల్లోనే తినేయాలి. పచ్చసొన వేయకపోతే నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది.