Vegetable Chapathi: వెజిటబుల్ చపాతీ ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది, దీన్ని చేయడం చాలా సులువు
Vegetable Chapathi: బ్రేక్ ఫాస్ట్‌లో వెజిటబుల్ రోటి తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీన్ని చేయడం చాలా సులువు. ఒక్క రోటి తింటే పొట్ట సులువుగా నిండిపోతుంది.
Vegetable Chapathi: అల్పాహారంలో వెజిటబుల్ చపాతీ లేదా రోటీ తిని చూడండి. ఆ రోజంతా మీకు ఆకలి తక్కువగా వేస్తుంది. సంపూర్ణంగా గోధుమ పిండితో చేసిన చపాతీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వెజిటబుల్ రోటీని ఎలాంటి చట్నీ, కూర లేకుండా సాదా పెరుగుతో తినేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎన్నో రకాల కూరగాయలను జోడిస్తాము, కాబట్టి పోషకాలు కూడా నిండుగా లభిస్తాయి.
వెజిటబుల్ చపాతీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
క్యారెట్ - ఒకటి
బీన్స్ - నాలుగు
జీలకర్ర పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - ఒక స్పూను
ఉల్లిపాయ తరుగు - గుప్పెడు
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత
వెజిటబుల్ చపాతీ రెసిపీ
1. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
2. ఆ ఉడికించిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3. ఆ గిన్నెలోనే గోధుమపిండి వేసి బాగా కలుపుకోవాలి.
4. అవసరమైతే గోరువెచ్చని నీళ్లను వేసి కలుపుకోవాలి.
5. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
6. చపాతీ పిండిలా దీన్ని కలుపుకున్నాక మూత పెట్టి పావుగంట పాటు వదిలేయాలి.
7. తర్వాత చిన్న ముద్దను తీసుకొని రోటీల్లాగా ఒత్తుకొని పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
8. అంతే టేస్టీ వెజిటబుల్ చపాతీ సిద్ధమైనట్టే.
9. పిల్లలకు ఒక్క చపాతీ తింటే చాలు పొట్ట నిండిపోతుంది.
10. పెద్దవాళ్లు రెండు రోటీలతో పొట్ట నింపుకోవచ్చు.
11. దీనికోసం ప్రత్యేకంగా ఏ కూర వండుకోవాల్సిన అవసరం లేదు. పెరుగులో నంజుకొని తింటే ఇది టేస్టీగా ఉంటుంది.
సాధారణ రొట్టెలతో పోలిస్తే ఈ వెజిటబుల్ రోటీ తినడం వల్ల పోషకాలు ఎక్కువ అందుతాయి. ఎందుకంటే సాధారణ చపాతీలో కేవలం గోధుమ పిండి మాత్రమే ఉంటుంది. కానీ వెజిటబుల్ రోటీలో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్లు, బీన్స్ ఇలా రకరకాల కూరగాయలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో పోషకాలు అందుతాయి. ఒక్కసారి దీన్ని చేసుకొని తింటే మీకు తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇది బ్రేక్ ఫాస్ట్ లోనే కాదు లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. డిన్నర్లో లైట్ గా ఆహారం తీసుకోవాలనుకునేవారు ఈ వెజిటబుల్ రోటీని ప్రయత్నించండి.