Kothimeera Karam Podi: కొత్తిమీర కారంపొడి ఇలా చేస్తే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది, ప్రతిరోజూ తినవచ్చు
Kothimeera Karam Podi: కొత్తిమీర కారంపొడి రెసిపీ చాలా సులువు. ఇది ఇడ్లీలోనూ, దోశెల్లోనూ, అన్నంలోనూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర కారంపొడి ఎలా చేయాలో తెలుసుకుంటే ఆరు నెలలుకు సరిపడా చేసి పెట్టుకోవచ్చు.
Kothimeera Karam Podi: మనం తినే అన్ని ఆకుకూరలు, కూరగాయల్లో ఎక్కువగా మేలు చేసేవి కొత్తిమీరే. కొత్తిమీరతో చేసిన ఏ వంటైనా అదిరిపోతుంది. ఇక కొత్తిమీరనే పొడిలా చేసి పెట్టుకుంటే ఆ రుచి మాములుగా ఉండదు. ఒక్కసారి కొత్తిమీర కారం పొడి చేశారంటే అది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. కొత్తిమీర కారంపొడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర కారంపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
కొత్తిమీర ఆకులు - రెండు కప్పులు
ఎండుమిర్చి - నాలుగు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో
మినప్పప్పు - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
ఆవాలు - అర స్పూను
మెంతి గింజలు - అర స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూను
కొత్తిమీర కారంపొడి రెసిపీ
1. కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి ఒక వస్త్రంపై నీడలోనే ఎండబెట్టాలి.
2. ఒకరోజు లేదా రెండు రోజులు ఇలా ఆరనిస్తే తడి లేకుండా ఆరిపోతాయి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
4. తర్వాత మెంతి గింజలు, ఎండుమిర్చి, మినప్పప్పు కూడా వేసి వేయించుకోవాలి.
5. అదే కళాయిలో కొత్తిమీర తరుగును వేసి వేయించాలి.
6. కాస్త పసుపు పొడిని కూడా జోడించుకోవాలి.
7. కొత్తిమీరలోని తడి ఆరిపోయేదాకా ఆ మిశ్రమాన్ని చిన్న మంట మీద వేయించుకోవాలి.
8. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు, చింతపండును వేయాలి.
9. దీన్ని మెత్తని పొడిలా చేసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్లో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకొని ఆరు నెలల పాటు వాడుకోవచ్చు.
10. భోజనం చేసే ముందు అన్నంలో ఈ పొడిని వేసుకొని కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.
11. అలాగే ఇడ్లీలపై దీన్ని చల్లుకొని తింటే ఆ రుచే వేరు. దోశెల్లో కూడా దీన్ని తినవచ్చు.
12. అవసరమనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు ఓ పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
13. వెల్లుల్లి ఇష్టం లేనివారు సాధారణంగానే కొత్తిమీర పొడిని చేసుకోవచ్చు.
కొత్తిమీర నిజానికి ఒక ఔషధ మొక్క. దీనిని ఒక మూలికగా చెబుతారు. కొత్తిమీర మొదటగా దక్షిణ ఐరోపా నుండి ఇతర దేశాలకు చేరుకుందని అంటారు. ఇప్పుడు కొత్తిమీర లేనిదే తెలుగింట్లో ఒక్క కూర పూర్తి కావడం లేదు. కొత్తిమీర ఆకులు ఎంత ఆరోగ్యకరమంటే...అవి మన శరీరంలోని ప్రతి భాగానికి ఏదో ఒక మేలు చేస్తూనే ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
ప్రతిరోజూ దీన్ని తినేవారు రోగనిరోధక వ్యవస్థను బలపరచుకోవచ్చు. ఖాళీ పొట్టతో కొత్తిమీర రసాన్ని తింటే శరీరం మొత్తం డిటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. దీని వల్ల వ్యర్ధాలు, విషాలు బయటకు వచ్చేస్తాయి. దీనిలో మాంగనీస్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం అంటే ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవే. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడినవారు ప్రతిరోజూ కొత్తిమీరను తినాలి.
ఇక్కడ మనం ఇచ్చిన రెసిపీ కొత్తిమీర కారంపొడి. దీనిలో మనం పెద్దగా నూనెను ఉపయోగించలేదు. ఉప్పును కూడా సరిపడినంతే వేసాము. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన రెసిపీ కిందకే వస్తుంది. ఈ కొత్తిమీర కారంపొడి రెసిపీని డయాబెటిస్ పేషెంట్లు, అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు తినవచ్చు. దీనివల్ల వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
టాపిక్