Vampire Facial | అందాల రాక్షసిగా మారేందుకు అమ్మాయిలకు వాంపైర్ ఫేషియల్!
Vampire Facial: వాంపైర్ అంటే రక్తపిశాచి అని అర్థం. మరి వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి? అందంకోసం వాంపైర్ ఫేషియల్ చేసుకుంటే ఫలితం ఉంటుందా? చూడండి.
మీరు హాలీవుడ్ సినిమాల్లో వాంపైర్ క్యారెక్టర్లను చూసే ఉంటారు. ఇవి మనుషుల్లాగే కనిపించే అందమైన రక్తపిశాచులు. మనుషుల రక్తాన్ని పీల్చి అవి బ్రతుకుతాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకూ అంటే, ఇప్పుడు సెలబ్రిటీలలో 'వాంపైర్ ఫేషియల్' (Vampire Facial) చేయించుకునే ట్రెండ్ కనిపిస్తుంది. తమ అందంకోసం, ముడతలు లేని యవ్వనమైన చర్మం కోసం ఈ వాంపైర్ ఫేషిషల్ ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. మరి దీనికి వాంపైర్ ఫేషియల్ అని పేరు ఎందుకు వచ్చింది, ఎలా ఈ ఫేషియల్ చేస్తారు మొదలైన విషయాలు తెలుసుకునేందుకు ఈ స్టోరీ చదవడం కొనసాగించండి.
వాంపైర్ ఫేషియల్‌ని PRP ఫేషియల్ అని కూడా అంటారు. PRP అంటే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ఫేషియల్ మొదటి దశలో శరీరం నుండి మొదట రక్తాన్ని సంగ్రహించడం జరుగుతుంది. అనంతరం ఆ రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి దానిని శుద్ధి చేస్తారు. ఆపైన మళ్లీ దీనిని చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తూ చికిత్స చేస్తారు. ఇది చర్మంలోపల కొత్త కణాల పెరుగుదల, పునరుత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ విధంగా రక్తాన్ని ఉపయోగించి చేసే ఒక సౌందర్య ప్రక్రియ కాబట్టి దీనిని వాంపైర్ ఫేషియల్‌గా పిలుస్తున్నారు.
Benefits of Vampire Facial- ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
వాంపైర్ ఫేషియల్ చికిత్సలో, సాధారణం కంటే 4 నుండి 5 రెట్లు ఎక్కువ ప్లేట్‌లెట్ల సాంద్రత కలిగిన ప్లాస్మాను చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎర్ర రక్త కణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది, అనారోగ్యమైన ప్లాస్మాను వేరు చేస్తుంది. సౌందర్య శాస్త్రవేత్తల ప్రకారం, చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి ప్లేట్‌లెట్ అధికంగా ఉండే ప్లాస్మాను ఇంజెక్ట్ చేయడమే ఈ చికిత్స ప్రధాన లక్ష్యం.
చర్మాంలో కొల్లాజెన్ పెరిగితే మొటిమల మచ్చలు, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోయి చర్మం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. వయస్సు ప్రభావిత ముడతలు, వెంట్రుకలు నెరవటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది.
గురుగ్రామ్‌లోని స్క్వేర్ రూట్స్ క్లినిక్ వ్యవస్థాపకురాలు డా. జోతిర్మయి భారతి హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్ విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ఉత్తేజపరిచేందుకు, చర్మం ఆకృతిని, స్థితిస్థాపకతను, ప్రకాశాన్ని మెరుగుపరిచేందుకు PRP ఫేషియల్ చేస్తారు. ప్లాస్మాలో ఉండే వృద్ధి కారకాలను ఉపయోగించడం ద్వారా PRP థెరపీ పనిచేస్తుందని డా. జోతిర్మయి వివరించారు.
ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి శరీరం నుండే కొద్ది మొత్తంలో రక్తం తీసుకుంటారు. సెంట్రిఫ్యూగేషన్ అనే ప్రక్రియ ద్వారా రక్తంలోని ప్లాస్మాను మిగిలిన రక్త కణాల నుండి వేరు చేస్తారు. ప్లాస్మా అప్పుడు సూదులు లేదా ఇతర మార్గాల ద్వారా వ్యక్తి చర్మంలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుందని డా. జోతిర్మయి తెలిపారు.
నొప్పిలేకుండా చికిత్స
PRP కోసం రక్తాన్ని తీసుకున్నప్పుడు, ముఖం లేదా చర్మం ప్రాంతానికి స్పర్శరహిత క్రీమ్ వర్తింపజేస్తారు. రక్తం నుండి ప్లాస్మాను వేరు చేసే దశ 30 నుండి 45 నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో ముఖం పూర్తిగా శుభ్రపరచడం చేస్తారు. మైక్రోనెడ్లింగ్ పద్ధతి ద్వారా ప్లాస్మాను ఇంజెక్ట్ చేస్తారు. చర్మం మొద్దుబారినందున ఈ చికిత్స వలన నొప్పి కలగదు. చికిత్స పూర్తయిన తర్వాత చర్మం కొద్దిగా ఎర్రగా మారుతుంది, కానీ 24 గంటల తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. ఆ తర్వాత మేకప్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని డెర్మటాలజిస్టులు అన్నారు.
దుష్ప్రభావాలు లేవా?
వారి ప్లాస్మాను వారికే ఉపయోగిస్తున్నందున ఇది శరీరం లేదా చర్మంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ చికిత్స జరిగిన 4 నుండి 6 వారాల తర్వాత ఫలితాలు కనబడతాయి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతీ 2 నుండి 3 నెలలకు ఒకసారి ఈ చికిత్స చేయాలి. ఇలా చేసిన తర్వాత సన్‌స్క్రీన్ ఉపయోగించడం తప్పనిసరి. థెరపిస్ట్ సూచించిన పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.
ఇది సురక్షితమేనా?
PRP థెరపీ అనేది ఒక వ్యక్తి రక్తాన్ని సేకరించి, దానిని తిరిగి ఇంజెక్ట్ చేయడం, కాబట్టి ఈ చికిత్స సాధారణంగా సురక్షితమైనదని చెప్తున్నారు. వారికి వారి స్వంత రక్తాన్ని వారికి ఇవ్వడం వల్ల అలెర్జీ ప్రతిచర్యలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉండదు. అయినప్పటికీ, జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ఈ చికిత్స చేసుకోవాలనుకునే వారు అర్హత కలిగిన నిపుణుడిని సందర్శించి, వైద్యుల సలహా పొంది, ఆ తర్వాతనే కొనసాగడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్