Honeycomb: తేనె తీశాక తేనెతుట్టెను ఏం చేస్తారు? తేనె కన్నా తుట్టె ధరే ఎక్కువెందుకు?
Honeycomb: తేనె తీశాక మిగిలిన తేనె తుట్టెను పడేస్తారు అనుకుంటున్నారా? కాదు. దాంతో అనేక ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యానికి, రుచికి, కొన్ని అవసరాలకు తేనె తుట్టెను వాడతారు.
తేనెటీగల ఆవాసం, ఆహారం అన్నీ తేనెతుట్టెలోనే. చిన్న జీవాలు తయారు చేసిన మధురమైన తేనెను ఆ తేనె తుట్టెనుంచి సేకరిస్తారు. తేనె తుట్టెను పిండి తేనె తీస్తారు. దీంట్లో షడ్భుజాకారంలో గదులుంటాయి. చూడ్డానికి ఇంత క్లిష్టమైన నిర్మాణం ఎలా సాధ్యమైందా అనిపిస్తుంది. మరి తేనె తీశాక మిగిలిన తేనెతుట్టెను అలా పడేస్తారు అనుకుంటున్నారా? కాదు. దాన్ని ఎన్ని రకాలుగా వాడతారో చూడండి.
బీస్ వ్యాక్స్:
ఈ తేనెతుట్టెలో మైనం ఉంటుంది. దాన్నే బీస్ వ్యాక్స్ అంటారు. కొద్దిగా ప్రాసెస్ చేసి వాడుకునే విధంగా బీస్ వ్యాక్స్ తయారు చేస్తారు. స్వచ్ఛమైన బీస్ వ్యాక్స్ ధర తేనె కన్నా ఎక్కువగా ఉంటుంది. దీంతో కొవ్వొత్తులు, లిప్ బామ్స్, చర్మ సౌందర్య ఉత్పత్తులు, మాయిశ్చరైజర్లు, కాస్మోటిక్స్, సబ్బులు.. ఇలా చాలా తయారు చేస్తారు. బీస్ వ్యాక్స్ ఉన్న ఉత్పత్తుల ధర కూడా ఎక్కువే ఉంటుంది. చర్మానికి కావాల్సిన తేమను బీస్ వ్యాక్స్ అందిస్తుంది.
గీతలు పడ్డ ఫర్నీచర్, లేదా పాత ఫర్నీచర్ కొత్తగా మార్చేయడానికి ఈ బీస్ వ్యాక్స్‌తో పాలిష్ వేస్తారు. లెదర్‌తో తయారు చేసిన వస్తువులను భద్రపరచడానికి బీస్ వ్యాక్స్ పూత వేస్తారు. వాటర్ ప్రూఫ్ కోటింగ్ లాగా ఇది పనికొస్తుంది. ఇలా అనేక రకాలుగా దీన్ని వాడతారు.
తినడానికి:
తాజాగా తేనెను తీసిన తేనె తుట్టెను తింటారు కూడా. చాలా రుచిగా ఉంటుందిది. బ్రెడ్, కేకులు, టోస్టులు, ఐస్ క్రీం, గులాబ్ జామూన్ల లాంటి స్వీట్ల్ మీద జామ్ లాగా దీన్ని చిన్న ముక్క పెట్టి తింటారు. కొన్ని చోట్ల డెజర్ట్ లాగానూ దీన్ని సర్వ్ చేస్తారు. సలాడ్లు, స్మూతీలలో ముక్కలు వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక పాశ్చాత్య దేశాల్లో కేవలం చీజ్ తినే అలవాటుంటుంది. చీజ్, బీస్ వ్యాక్స్ కలిపి తింటే అద్భుతమైన రుచి ఉంటుందట.
చూయింగ్ గమ్:
తేనెతుట్టెలో మైనం ఉంటుంది. ఇది కొంత మోతాదులో తింటే ఏం ప్రమాదం కాదు. అది కూడా తినడం ఇష్టం లేకపోతే చిన్న తేనెతుట్టె ముక్కను తీసుకుని నమిలారంటే చూయింగ్ గమ్ తింటున్నట్లే ఉంటుంది. దాన్నుంచి కొద్దిగా తేనె వస్తూ తియ్యగా అనిపిస్తుంది. నములుతుంటే నోట్లో కేవలం మైనం మిగిలిపోయాక దాన్ని ఉమ్మేయడమే.
తేనెతుట్టె తింటే ప్రమాదం లేదా?
సాధారణంగా దీన్ని తినడం ప్రమాదకరం ఏమీ కాదు. దీంట్లో ముడి తేనె ఉంటుంది. అనేక పోషకాలుంటాయి. అయితే చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు దీనికి దూరంగా ఉండటం మంచిది. దీంట్లో మైనం ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో తింటే కడుపు నొప్పి, ఉదర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తినేటప్పుడు నమిలేసి తేనె తియ్యదనం పోయాక ఉమ్మివేయడం మంచి మార్గం. అప్పుడు ఏ సమస్య ఉండదు.
టాపిక్