Skin Care: ఫేష్‍వాష్ బదులు వంటింట్లో ఉండే వీటిని ముఖానికి వాడండి.. చర్మం తళతళ మెరుస్తుంది!-use these things in your kitchen to wash your face instread face washes for natural glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Care: ఫేష్‍వాష్ బదులు వంటింట్లో ఉండే వీటిని ముఖానికి వాడండి.. చర్మం తళతళ మెరుస్తుంది!

Skin Care: ఫేష్‍వాష్ బదులు వంటింట్లో ఉండే వీటిని ముఖానికి వాడండి.. చర్మం తళతళ మెరుస్తుంది!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Nov 09, 2024 09:30 AM IST

Skin Care: ఫేష్‍వాష్‍లు వినియోగించకపోయినా వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను ముఖానికి వాడొచ్చు. వీటి వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. చర్మ సమస్యలు తగ్గేందుకు కూడా ఇవి సహకరిస్తాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.

Skin Care: ఫేష్‍వాష్ బదులు వంటింట్లో ఉండే వీటిని ముఖానికి వాడండి.. చర్మం తళతళ మెరుస్తుంది!
Skin Care: ఫేష్‍వాష్ బదులు వంటింట్లో ఉండే వీటిని ముఖానికి వాడండి.. చర్మం తళతళ మెరుస్తుంది!

ముఖంపై చర్మం మెరుస్తూ ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. చర్మం మెరుపుతో ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‍లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రొడక్టులను వాడుతుంటారు. అయితే, రసాయనాలు ఎక్కువగా ఉండే పేష్‍వాష్‍లు లాంటి ప్రొడక్టులు వాడితే ముఖంపై చర్మానికి చేటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొందరి చర్మానికి ఈ ప్రొడక్టులు సూటవవు. చర్మం పొడిగా మారుతుంది. అయితే, ఫేష్‍వాష్‍లు వాడకున్నా ముఖం మెరుపు పెంచేందుకు మీ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అవేవో.. వేటితో తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

శనగపిండి, పెరుగుతో..

ముఖం క్లీన్ చేసుకునేందుకు ఫేష్‍వాష్ బదులు.. శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వాడొచ్చు. దీని వల్ల చర్మం మెరుపు పెరగటంతో పాటు మెటిమలు, మచ్చలు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మానికి బాగా మేలు చేస్తుంది

ఎలా చేయాలి: ముందుగా కాస్త శనగపిండి తీసుకోవాలి. దాంట్లో రెండు స్పూన్‍ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి స్క్రబ్‍లా మసాజ్ చేసుకోవాలి. ముఖమంతా బాగా రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడిగేసుకోవాలి. ఇది వాడడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. రెగ్యులర్‌గా శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని ముఖానికి వాడితే చర్మం మెరుపు పెరుగుతుంది.

పెసల పొడి

మీ ముఖాన్ని సహజంగా వాష్ చేసుకోవాలనుకుంటే పెసల పొడి కూడా మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఇందుకోసం ముందుగా పెసలను బాగా పొడిగా చేసుకోవాలి. ముఖం కడుక్కోవాలని అనుకున్నప్పుడు.. పెసల పొడిలో కాస్త నీరు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. బాగా రుద్దుతూ ముఖానికి పెసల పొడి అప్లై చేసుకోవాలి. అది ఆరిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే ముఖం మెరుపు అధికం అవుతుంది.

క్రీమ్‍తో మసాజ్

క్రీమ్ వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారకుండా ఇది చేయగలదు. చర్మానికి తేమ అందించి.. మెరుపును కాపాడగలదు. క్రీమ్‍ను మీ ముఖానికి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. కావాలంటే, ఫేస్‍ప్యాక్‍లు, స్క్రబ్‍ల్లోనూ క్రీమ్‍ను కలుపుకోవచ్చు.

రోజ్ వాటర్

రోజ్ వాటర్ వల్ల చర్మానికి చాలా లాభాలు ఉంటాయి. చర్మానికి డీప్‍గా క్లీన్ చేస్తుంది. హైడ్రేటెడ్‍గా, మెరుపుతో ఉండేలా చేయగలదు. రోజ్ వాటర్‌ను దూదిపై కాస్త వేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ముఖం మెరుపు పెరగడం గమనిస్తారు.

ముల్తానీ మట్టి

చర్మానికి ముల్తానీ మట్టి వాడడం చాలా పాపులర్. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. చర్మం నుంచి అదనపు జిడ్డును ఇది తొలగించి మెరుపు పెంచగలదు. మొటిమలు, మచ్చలు తగ్గేందుకు తోడ్పడుతుంది. ముల్తానీ మట్టిలో కాస్త నీరు వేసుకొని కలుపుకొని.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అది అరిన తర్వాత నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ముల్లానీ మట్టిని రాసిన తర్వాత ముఖాన్ని రుద్దకూడదని గుర్తు పెట్టుకోవాలి. ముల్తానీమట్టి చర్మాన్ని పొడిగా చేసే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని వాడిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే మేలు.

Whats_app_banner